ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాలు అనుమానంతో విషాద ఘటన చోటుచేసుకుంది. చౌడేశ్వర నగర్ ప్రాంతంలో ఉదయం పాలు తాగిన అనంతరం పలువురు అస్వస్థతకు గురవ్వడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో కృష్ణవేణి (85), కనకరత్నం (70) అనే ఇద్దరు వృద్ధురాళ్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అదే పాలు తాగిన మరో 13 మందికి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతా బాధితులు కూడా పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
అనూరియా లక్షణాలతో బాధితులు
వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితులందరూ ‘అనూరియా’ అనే ప్రమాదకర పరిస్థితితో బాధపడుతున్నారు. ఇది కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో మూత్రం పూర్తిగా ఆగిపోవడం. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడంతో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఈ లక్షణాలు కల్తీ పాల వల్ల వచ్చాయా? లేక మరే ఇతర కారణాలున్నాయా? అనే దానిపై వైద్యులు, అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారి అరెస్ట్.. ల్యాబ్ పరీక్షలు ప్రారంభం
విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పాలు సరఫరా చేసిన వ్యాపారిని అరెస్ట్ చేశారు. అనుమానాస్పద పాల శాంపిల్స్‌ను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణం తేలనుంది. ఇక అపార్ట్‌మెంట్‌లోని వాటర్ ట్యాంకర్లు శుభ్రం చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ సోకిందా? అన్న కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.
ప్రాంతంలో భయాందోళనలు
ఘటనతో చౌడేశ్వర నగర్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం పాలు తాగడానికే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. స్థానికులు పాల సరఫరాపై కఠిన నియంత్రణలు తీసుకోవాలని, కల్తీ పాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి ల్యాబ్ రిపోర్ట్స్ వెలువడిన తర్వాతే ఈ విషాదానికి అసలు కారణం ఏంటో స్పష్టత రానుంది. అప్పటివరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.