తిరుమ‌ల‌కి ప్లాన్ చేసుకుంటున్న వారికి అల‌ర్ట్.. మార్చి 3న 10 గంటలకు పైగా ఆలయం మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం ఉదయం 9 నుంచి రాత్రి 7:30 వరకు మూసివేస్తారు. దర్శనాలు రద్దు — భక్తులకు ముందస్తు అలర్ట్.

TTD Darshan On Lunar Eclipse 2026
  • మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం 10 గంటలకు పైగా మూసివేత

  • రూ.300 దర్శనం, VIP బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు

  • రాత్రి 8:30 నుంచి దర్శనాలు తిరిగి ప్రారంభం

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా ప్రకటించింది. సంప్రదాయ ఆచారాలు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు ముందుగానే తమ యాత్ర ప్రణాళికలను సరిచేసుకోవాలని టీటీడీ సూచించింది.
టీటీడీ ప్రకటన ప్రకారం, మార్చి 3వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు 10 గంటల 30 నిమిషాల పాటు దర్శనాలు నిలిపివేయబడతాయి. అదే రోజు సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయడం సంప్రదాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరిచి, శుద్ధి కార్యక్రమాలు, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఆపై రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభమవుతుంది.

మార్చి 3న ఆలయ నిర్వహణ వివరాలు :

  • ఆలయం మూసివేత: ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు
  • మూసివేత వ్యవధి: సుమారు 10 గంటల 30 నిమిషాలు
  • చంద్రగ్రహణం ప్రారంభం: సాయంత్రం 3.20 గంటలు
  • చంద్రగ్రహణం ముగింపు: సాయంత్రం 6.47 గంటలు
  • దర్శనాల పునఃప్రారంభం: రాత్రి 8.30 గంటల నుంచి

రద్దు చేసిన ఆర్జిత సేవలు :

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన కింది ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది:
  • అష్టదళ పాద పద్మారాధన
  • కళ్యాణోత్సవం
  • ఊంజల్ సేవ
  • ఆర్జిత బ్రహ్మోత్సవం
  • సహస్రదీపాలంకార సేవ

రద్దైన దర్శనాలు :

గ్రహణం నేపథ్యంలో ఆ రోజు ఈ దర్శనాలు కూడా రద్దు చేయబడ్డాయి:
  • వీఐపీ బ్రేక్ దర్శనాలు
  • శ్రీవాణి దర్శనాలు
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం
  • చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనం
  • వృద్ధులు, దివ్యాంగుల దర్శనం
  • దాతల దర్శనం
  • ఎన్ఆర్ఐ దర్శనం
టీటీడీ అధికారులు భక్తులందరూ ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్రను సక్రమంగా ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రహణం రోజున ఆలయానికి రావాలనుకునే భక్తులు దర్శనాల సమయాల్లో మార్పులను ముందుగానే తెలుసుకొని అసౌకర్యాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »