తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంప్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఫోటోను తీసుకువెళ్లి అక్కడ ఉంచారు. అనంతరం “జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్పందన
ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం వల్లే కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారు. అసెంబ్లీలో ‘మా దగ్గర కూడా కండలు తిరిగినవాళ్లు ఉన్నారు’ అని మాట్లాడటం సరైంది కాదు” అంటూ విమర్శించారు.
శాంతిభద్రతలపై ఆందోళన
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి దిగజారుతోందని ఆమె ఆరోపించారు. పట్టపగలే దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ఈ ఘటనలో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా వేడెక్కిన వాతావరణం
ఈ ఘటనతో తెలంగాణలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా… ఈ పరిణామం మరింత దూరం వెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే అధికార మదంతో దాడులకు దిగుతున్న తీరు బీహార్ గ్యాంగ్‌లను తలపిస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధుల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.
గూండా రాజ్యం…
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? ప్రైవేట్ సైన్యంలా మారిందా? అని ఆయన నిలదీశారు. ఒకవైపు ‘హేట్ స్పీచ్ బిల్’ పేరుతో ప్రతిపక్షాల స్వరాన్ని అణచివేస్తూ, మరోవైపు తమ అనుచరులతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. “ఇందిరమ్మ రాజ్యం” పేరుతో గూండా రాజ్యాన్ని అమలు చేస్తున్నారా? అని ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి, రాష్ట్ర పరిపాలనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులకు కాంగ్రెస్ నాయకులకు పరోక్షంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అణచివేతలకు బీఆర్ఎస్ భయపడదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఆగకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.


