ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే మండిపోతున్న ఎండలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఈ అంశంపై ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందించారు. భారత వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపారు. అలాగే వడగాలుల ప్రభావం కూడా ఎక్కువ రోజులు ఉండొచ్చని హెచ్చరించారు.
మార్చి నెలలో ఈ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా మార్కాపురం ప్రాంతాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
ఏప్రిల్–మేలో మరింత తీవ్రత
మార్చి నుంచి మే నెలల మధ్య రాష్ట్రంలో వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు.
గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి
ఇదే సమయంలో తెలంగౄణ రాష్ట్రంలో కూడా మార్చి నుంచి మే నెలల వరకు దాదాపు అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడి తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడాన్ని తగ్గించడం, ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండల ప్రభావం నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.