తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్–పెద్దపల్లి బైపాస్ మార్గంలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. Karimnagar Road Accidentగా మారిన ఈ ఘటనలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సీఐ ప్రదీప్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాత్రి సమయంలో వేగంగా ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.
ఇద్దరు స్పాట్ డెడ్..
ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో సయ్యద్ అబ్దుల్ రహమాన్ (19), సయ్యద్ ఆతియాబ్ హుస్సేన్ (21) తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో యువకుడు ఎండీ అదునాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
Also Read: ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు.. ఇరాన్ యుద్ధ ప్రభావంతో పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ రికార్డు స్థాయికి
ఇక నాలుగో వ్యక్తి ఎండీ అబ్రార్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి కారు నుంచి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతని అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా..
ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే కరీంనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. యువకుల మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమికంగా అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి వేళల్లో వేగం నియంత్రణలో లేకపోవడం, అప్రమత్తతతో ఉండకపోవడం వంటి అంశాలు ఇలాంటి (Karimnagar Road Accident) ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.


