అన్న ఎన్టీఆర్, చంద్ర‌బాబుల‌ని చూశాం.. ఇలాంటి ముఖ్య‌మంత్రిని ఎప్పుడు చూడ‌లేద‌న్న కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ హామీలు విఫలమయ్యాయని ఆరోపించారు.

KTR criticizing CM Revanth Reddy during municipal election campaign political rally

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్రచారం తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్రచారం తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తుంది. ఈ సారి త్రిముఖ పోటీ ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి స్వ‌యంగా చెప్పారు. తాము త‌ప్ప‌క గెలుస్తామ‌ని అధికార పార్టీ చెబుతున్నా, ప్ర‌తిప‌క్షాలు మాత్రం మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో జెండా ఎగుర‌వేస్తామ‌ని అంటున్నారు. అయితే తాజాగా కేటీఆర్ ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినప్పటికీ రేవంత్ రెడ్డి లాంటి సీఎంని ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించారు. హామీల గురించి ప్రశ్నిస్తే అనుచిత పదజాలంతో మాట్లాడుతున్నారని, ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగదని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి, పరకాల ప్రాంతాల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ పాల్గొని ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: భార్య పోటీ చేస్తే భర్తపై వేటా? చేర్యాలలో కానిస్టేబుల్ సస్పెన్షన్ కలకలం!

తీవ్ర ఆరోప‌ణ‌లు..

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామనే వార్తలపై స్పందిస్తూ, “జిల్లాను రద్దు చేసే హక్కు సీఎం దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జిల్లా ఆయనే చేశాడా?” అని ప్రశ్నించారు. ఒకవేళ జిల్లా రద్దు చేస్తే భూపాలపల్లి ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎవరైనా అనుచితంగా మాట్లాడితే సహించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదు. మా కార్యకర్తలను అవమానిస్తే చూస్తూ ఉండం” అని అన్నారు. అధికారంలో ఉన్న సమయం తాత్కాలికమని, భవిష్యత్తులో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

హామీలు అమ‌లు చేయ‌లేక‌పోయింది..

కాంగ్రెస్ పార్టీ పాలనపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు కనీస అభివృద్ధి పనులు కనిపించలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు. పెన్షన్ రూ.4 వేలుగా పెంచుతామని, తులం బంగారం ఇస్తామని, రైతుబంధు పెంపు చేస్తామని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి సంస్థలో కూడా అవినీతి జరిగిందని, ప్రజల సంపదను దోచుకుంటున్నారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ప్రభుత్వం హామీల అమలు గురించి ఆలోచిస్తుందని ఓటర్లకు సూచించారు. బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల వేడి మరింత పెరిగింది. మాటల యుద్ధం కొనసాగుతుండగా, ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »