పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు… పార్టీ నుంచి తాత్కాలిక సస్పెన్షన్

హైదరాబాద్ శివార్లలో జరిగిన ఫార్మ్‌హౌస్ ఘటనపై ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 7 రోజుల్లో వివరణ కోరింది.

Pilot Rohit Reddy
Pilot Rohit Reddy

హైదరాబాద్ శివార్లలో జరిగిన ఫార్మ్‌హౌస్ ఘటన రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో మాదకద్రవ్యాల వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

పార్టీ క్యాడర్‌కు ఇది క్లియర్ మెసేజ్…

పార్టీ లైన్ దాటితే సొంత బిడ్డ అయినా, ఎంత పెద్ద నాయకుడు అయినా వేటు తప్పదు అని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్ గారు

పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన లేఖలో, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

నోటీసు ప్రకారం, ఫార్మ్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగంపై వస్తున్న ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయని, ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని రోహిత్ రెడ్డిని ఆదేశించింది.

అదేవిధంగా, 7 రోజుల్లోగా పూర్తి వివరణ సమర్పించాలని పార్టీ స్పష్టం చేసింది. ఈ వ్యవధిలో సరైన సమాధానం ఇవ్వకపోతే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ క్రమంలో, విచారణ పూర్తయ్యే వరకు రోహిత్ రెడ్డిని పార్టీ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఇది పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన చర్యగా పేర్కొంది.

పార్టీ నాయకత్వం స్పష్టంగా తెలియజేసింది క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని. ఎవరైనా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Rohit Reddy BRS notice
Rohit Reddy BRS notice

నేపథ్యం

ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫార్మ్‌హౌస్ పార్టీపై పోలీసులు దాడి చేయగా, అక్కడ మాదకద్రవ్యాల వినియోగంపై ఆరోపణలు బయటపడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం.

ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు రావడంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ క్రమశిక్షణను కాపాడటం రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం. ప్రజాప్రతినిధులపై వచ్చే ఆరోపణలు పార్టీ ఇమేజ్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో ఫార్మ్‌హౌస్ ఘటనపై జరుగుతున్న దర్యాప్తు ఎలా మలుపు తిరుగుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

Also read : మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు: ఏలూరు ఎంపీకి కోకైన్ పాజిటివ్.. రాజకీయాల్లో కలకలం

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »