తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాలుగు దశాబ్దాలకుపైగా కృషి చేసిన నాయకుడిగా జీవన్ రెడ్డి పేరు ఉంది. అయితే ఇటీవల పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల జీవన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు.
ఫ్లెక్సీలు తొలగించడమే కారణమా..
ఇటీవల ఈ అసంతృప్తి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. చివరకు పార్టీని వీడే పరిస్థితి ఏర్పడింది. సోమవారం సాయంత్రం జగిత్యాల పట్టణంలోని ఆయన నివాసం, ‘ఇందిరా భవన్’ వద్ద జీవన్ రెడ్డి సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం ఈ నిర్ణయానికి సంకేతంగా మారింది.
Also Read: చైత్ర అమావాస్య 2026: మార్చి 18నా? 19నా? సరైన తేదీ, పూజా విధులు తెలుసుకోండి
జగిత్యాల జిల్లాలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి, ఇటీవల పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జీవన్ రెడ్డి కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా చేరిన వారికే ఎక్కువ సీట్లు కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం రాష్ట్ర స్థాయి నాయకత్వం దృష్టికీ వెళ్లినట్లు సమాచారం.
ఏ పార్టీలో చేరబోతున్నారు..
ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులపై జీవన్ రెడ్డి విమర్శలు మరింత తీవ్రతరం చేశారు. సంజయ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నప్పటికీ, గత నెలలో చొప్పదండిలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఆయన కనిపించడం జీవన్ రెడ్డి అనుచరుల్లో అసహనాన్ని పెంచింది.
ఈ పరిణామాల మధ్య జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన అనుబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఆయన బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ వీడడం పక్కా..
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. జీవన్ రెడ్డి కూడా ఇతర పార్టీల్లో చేరే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ కాంగ్రెస్ పార్టీని వీడటం మాత్రం ఖాయమని వెల్లడించారు.
తాను ఎప్పటికీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైన విషయం కూడా తెలిసిందే. అందువల్ల భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉండవచ్చన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సోమవారం జీవన్ రెడ్డి మొక్కజొన్న రైతులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఆయన నివాసం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి నేతృత్వంలోని రైతుల ప్రతినిధి బృందం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించింది.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని, ఉగాది పండుగ నాటికి రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు. మొత్తానికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.