తెలంగాణలో చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. ఆదివారం వచ్చింది అంటే చాలా ఇళ్లలో చికెన్ వంటకాలు తప్పనిసరి. ఫంక్షన్లు, పెండ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లోనూ చికెన్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
పలు జిల్లాల్లో కిలో చికెన్ ధర రూ.340కు చేరగా, కొన్ని ప్రాంతాల్లో రూ.360 వరకు విక్రయిస్తున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కిలోపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరగడం గమనార్హం. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం రానున్న వారంలో ధరలు రూ.400 మార్క్‌ను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు.
హోల్‌సేల్, రిటైల్ మార్కెట్ పరిస్థితి
ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో లైవ్ బర్డ్ ధర ఒక్కటి రూ.178 నుంచి రూ.180 వరకు ఉంది. స్కిన్‌తో కిలో చికెన్ రూ.290 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.310 దాటింది. రిటైల్ మార్కెట్‌లో వీటిపై అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో సాధారణ వినియోగదారులపై భారం పడుతోంది.
డిమాండ్ పెరగడం ఒక కారణం
ప్రస్తుతం రంజాన్ మాసంతో పాటు పెండ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫంక్షన్లలో చికెన్ వినియోగం అధికంగా ఉండటంతో డిమాండ్ పెరిగింది. దీనివల్ల సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
అయితే డిమాండ్ మాత్రమే కాదు, వాతావరణ మార్పులు కూడా ప్రధాన కారణమని పౌల్ట్రీ యాజమానులు పేర్కొంటున్నారు. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటిపోతుండగా, రానున్న రోజుల్లో 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఎండ తీవ్రతతో పాటు రాత్రివేళ చలి ఉండటం కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
పలు జిల్లాల్లో ఫౌల్ట్రీల్లో కోళ్లు కొక్కెర వ్యాధితో చనిపోతున్నాయని సమాచారం. వనపర్తి మండలం పెద్దగూడెం ప్రాంతంలోని ఒక ఫౌల్ట్రీ షెడ్‌లో సుమారు 3 వేల కోళ్లు చనిపోయిన ఘటన కలకలం రేపింది. పశు సంవర్ధకశాఖ అధికారులు పరిశీలించగా, కొక్కెర తెగులు కారణమని నిర్ధారించారు. కోళ్ల మరణాలతో సరఫరా తగ్గిపోవడం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది.
రైతుల ఆందోళన
పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా కోళ్లు బతకడం లేదని, దానా ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే వేసవి కాలంలో చికెన్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చికెన్ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం మోపుతోంది. ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో చికెన్ ధరల పెరుగుదల మరింత ఇబ్బందిగా మారింది.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రాబోయే ఏప్రిల్, మే నెలల్లో కిలో చికెన్ ధర రూ.400 మార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరిస్థితులు స్థిరపడకపోతే ధరల పెరుగుదల కొనసాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

