గిరిజన రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు, ప్యానెల్స్
అదనపు విద్యుత్ విక్రయంతో నెలకు రూ.3,000 నుంచి రూ.5,000 ఆదాయం
తొలి దశలో 10,000 మంది రైతులకు పథకం లబ్ధి
తెలంగాణ ప్రభుత్వం గిరిజన రైతుల అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గిరిజన రైతుల సాగుభూములకు సాగునీటి సౌకర్యం కల్పించడమే కాకుండా, వారిని విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చాలన్న సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది.ఈ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యంలేని గిరిజన ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సోలార్ పంపుల ద్వారా సాగునీరు అందించనున్నారు. అదే సమయంలో రైతులు ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది మే 19న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. గిరిజన రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
⇒తెలంగాణ ఆర్థిక సర్వే 2026: జిల్లాల వారీ అభివృద్ధి ప్రభావం
నాబార్డు నుంచి రూ.600 కోట్ల రుణానికి సుముఖత
ఈ పథకం అమలుకు భారీ నిధులు అవసరం కావడంతో, ప్రభుత్వం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) నుంచి రుణం సేకరించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నాబార్డు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.
ప్రభుత్వ గ్యారెంటీతో
- తొలి విడతలో రూ.600 కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డు సానుకూలంగా స్పందించింది
- వచ్చే మార్చి నెల నాటికి నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది
- తొలి దశలో 10 వేల మంది రైతులకు లబ్ధి
నాబార్డు నుంచి వచ్చే రుణ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో సుమారు 10,000 మంది గిరిజన రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం మరో రూ.600 కోట్లు కేటాయించడంతో, పథకం అమలు మరింత వేగవంతం కానుంది.
పథకం లక్ష్యాలు – కీలక వివరాలు :
- ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాధించాలనుకుంటున్న ముఖ్య లక్ష్యాలు ఇవే:
- అటవీ హక్కుల పత్రాలు (FRO) కలిగిన
- సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతులు లబ్ధిదారులు
- వారి ఆధీనంలోని సుమారు 6 లక్షల ఎకరాల భూములకు సాగునీరు
- ఒక్కో రైతుకు సుమారు రూ.6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లు
- 100 శాతం సబ్సిడీతో పూర్తిగా ఉచితంగా అందజేత
- సాగునీటితో పాటు అదనపు ఆదాయం
- ఈ పథకంలోని మరో ముఖ్యాంశం రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే.
- వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను స్వయంగా వినియోగించుకోవచ్చు
- మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించే అవకాశం
- దీని ద్వారా రైతులకు నెలకు సుమారు
- రూ.3,000 నుంచి రూ.5,000 వరకు అదనపు ఆదాయం లభించనుంది
త్వరలో దరఖాస్తుల స్వీకరణ :
నాబార్డు నుంచి నిధులు విడుదలైన వెంటనే, జిల్లాల వారీగా అర్హులైన గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పథకం గిరిజన రైతుల వ్యవసాయ భవిష్యత్తును మార్చే దిశగా కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.