తెలంగాణ అసెంబ్లీలో సోమవారం బియ్యం ఎగుమతుల అంశంపై జరిగిన చర్చ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేయగా, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటిని ఖండిస్తూ ఘాటుగా స్పందించారు. దీంతో సభలో మాటల యుద్ధం నెలకొంది.
హరీశ్‌రావు ఆరోపణలు
బియ్యం ఎగుమతుల్లో భారీ స్కామ్ జరిగిందని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యంగా ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి విషయంలో పారదర్శకత లేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాల్సిన కాంట్రాక్టును ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కాంట్రాక్టు టెండర్ ప్రక్రియ ద్వారా జరిగిందా లేదా నామినేషన్ పద్ధతిలో ఇచ్చారా అని స్పష్టత కోరారు.
అలాగే కాకినాడ పోర్టులో ఏడాది పాటు బియ్యం నిల్వ ఉంచడం వల్ల వాటి నాణ్యత దెబ్బతిన్నదా లేదా అనే అంశంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సలహాదారు నియామకంపై విమర్శలు
ప్రేమ్‌చంద్ అనే వ్యక్తిని సలహాదారుగా నియమించడంపై కూడా హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ‘ఘరానా మోసగాడు’గా పేర్కొంటూ, అలాంటి వ్యక్తిని కీలక స్థానంలో ఎలా నియమించారని ప్రశ్నించారు. ఈ ఆరోపణలన్నింటినీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటైందని విమర్శించారు.
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి జరిగిందని, ఈ ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తులు లేరని మంత్రి స్పష్టం చేశారు. సివిల్ సప్లైస్ విభాగంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని తెలిపారు.
సభలో ఉద్రిక్త వాతావరణం
ఇద్దరు నేతల మధ్య జరిగిన వాగ్వాదంతో అసెంబ్లీలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షం ఆరోపణలు, అధికార పక్షం ప్రతిస్పందనలతో సభ హాట్ హాట్‌గా మారింది. మొత్తానికి, బియ్యం ఎగుమతుల వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
Also Read: Telangana Rythu Bharosa : రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం… సిద్దిపేటలో సీఎం భారీ అభివృద్ధి పనులు