తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం మొదలైన వర్షం తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో కుండపోతగా కురిసింది. అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది.
అత్యధిక వర్షపాతం ఎక్కడంటే?
- నగరంలోని హస్తినాపురంలో అత్యధికంగా 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- సులేమాన్ నగర్‌లో 14.5 మి.మి
- అత్తాపూర్‌లో 13.5 మి.మి
- వనస్థలిపురం, రాజేంద్రనగర్‌లో 12 మి.మి వర్షపాతం నమోదైంది.
రానున్న కొద్ది గంటల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
ఆరెంజ్ అలర్ట్ – ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 2 నుంచి 3 గంటల్లో వర్షం మరింత తీవ్రంగా కురిసే అవకాశం ఉందని సూచించారు.
అదే సమయంలో దాదాపు 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా:
- ఆదిలాబాద్ జిల్లా,
- నిర్మల్ జిల్లా
- నిజామాబాద్ జిల్లా
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
- సంగారెడ్డి జిల్లా
- వికారాబాద్ జిల్లా
- కామారెడ్డి జిల్లా
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి
వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం ఎండలు క్రమంగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.