కామారెడ్డిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి మధ్య మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసి ఘర్షణాత్మక పరిస్థితులను సృష్టించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగింది. ఈ అంశంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధమని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రకటిస్తూ స్థానిక శిశుమందిర్ ఆవరణలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ సవాల్‌ను స్వీకరించారు.
హైటెన్షన్ వాతావరణం
చర్చ వేదికగా నిర్ణయించిన శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసి క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రానివ్వలేదు.
Also Read: బాన్సువాడలో ఉద్రిక్తత: రిలయన్స్ మార్ట్‌లో హిందూ–ముస్లిం వాగ్వాదం తర్వాత ఘర్షణ
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఎవరూ శిశుమందిర్ వద్దకు రావద్దని కోరారు. ఇది తన కుటుంబంపై చేసిన ఆరోపణల వ్యవహారమని, తానే సాక్ష్యాలతో నిరూపించుకుంటానని తెలిపారు.
క్యాంప్ కార్యాలయం ముట్టడి ..
ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో మహేందర్ రెడ్డి కారుపై దాడి జరిగి, అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు వాహనాన్ని పల్టీ కొట్టించి నిప్పు పెట్టారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో కూడా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
భారీగా అరెస్టులు
వివిధ మార్గాల్లో శిశుమందిర్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇరు పార్టీల నేతలను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కామారెడ్డిలో చోటుచేసుకున్న ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. భూముల వివాదం నేపథ్యంలో ప్రారంభమైన ఈ రాజకీయ పోరు ఎటు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.