న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బుధవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కీలక వివరాలను వెల్లడించారు.
1. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్: రక్షణ మరియు పౌర విమానాల మేళవింపు
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను వ్యూహాత్మక ప్రాంతంగా గుర్తించి, దానిని రక్షణ శాఖే నిర్మించనుంది.
OLS సర్వే: ఏప్రిల్ 17న విమానయాన మరియు రక్షణ శాఖ అధికారుల బృందం ఆదిలాబాద్‌లో పర్యటించి OLS (Obstacle Limitation Surface) సర్వే నిర్వహించనుంది.
మాస్టర్ ప్లాన్: ఈ సర్వే అనంతరం రన్‌వే ఓరియంటేషన్, మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేస్తారు.
భూసేకరణ: రక్షణ శాఖ వద్ద ఉన్న 360 ఎకరాలకు తోడు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది.
టర్మినల్: సామాన్య ప్రజల కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రత్యేక టర్మినల్ బిల్డింగ్‌ను నిర్మిస్తుంది.
2. వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్ట్: 3 నెలల్లో శంకుస్థాపన!
వరంగల్ వాసులకు మరో తీపి కబురు అందింది. మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయింది.
శంకుస్థాపన: మరో మూడు నెలల్లోనే ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు ఫౌండేషన్ (శంకుస్థాపన) వేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడంలో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి మరో మూడు నెలల్లో ఫౌండేషన్ వేయబోతున్నాం. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైంది. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే.. ఈ ఎయిర్‌పోర్ట్… pic.twitter.com/McaFd2a39g
— G Kishan Reddy (@kishanreddybjp) April 8, 2026
3. ఇతర విమానాశ్రయాల అప్‌డేట్:
పెద్దపల్లి (అంతర్గాం): ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై నిర్వహించిన అధ్యయనంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే పనులు ముందుకు సాగుతాయి.
కొత్తగూడెం: ఇక్కడ ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయానికి అనుకూలం కాదని కేంద్రం స్పష్టం చేసింది.
మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మాటల్లో..
“తెలంగాణకు కేవలం ఒకే విమానాశ్రయం (హైదరాబాద్) ఉందన్న భావన ప్రజల్లో ఉంది. వారి డిమాండ్‌కు అనుగుణంగా ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్రం కట్టుబడి ఉంది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది.”
Also Read: తెలంగాణలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంఈఓ మరియు ఇన్‌స్పెక్టర్!
