మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం అందజేయడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి గాయత్రి నిలయంలో బస చేసి, తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
సాధారణ భక్తుల మాదిరిగానే..
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు క్యూ లైన్ గుండా ఆలయంలోకి వెళ్లి, స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అర్చకులు వేదాశీర్వచనాలు అందజేసి, తీర్థప్రసాదాలు మరియు శేషవస్త్రాలను సమర్పించారు.
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా, తిరుమలలో ఒక రోజు అన్నదానానికి అయ్యే మొత్తం రూ.44 లక్షలను టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి విరాళంగా అందజేశారు చంద్రబాబు నాయుడు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా భక్తులతో కొద్దిసేపు మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మనవడు దేవాన్ష్‌తో కలిసి సంతోషంగా గడిపిన దృశ్యాలు అక్కడి భక్తులను ఆకట్టుకున్నాయి.
అన్ని కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో..
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సహా పలువురు అధికారులు చంద్రబాబు కుటుంబానికి స్వాగతం పలికారు. ఆలయ దర్శనం నుంచి అన్నదానం వరకు అన్ని కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. అయితే చంద్రబాబు నాయుడు కుటుంబం ఇప్పటివరకు సుమారు 12 సార్లు తిరుమల అన్నదాన ట్రస్ట్‌కు భారీ విరాళాలు అందించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రతి శుభసందర్భంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడం, పేద భక్తులకు అన్నదానం చేయడం ద్వారా తమ భక్తి, సేవా భావాన్ని వారు నిరూపిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, సాధారణ భక్తుల మాదిరిగా క్యూ లైన్‌లోనే దర్శనానికి వెళ్లడం, వ్యక్తిగతంగా ఖర్చు చేసి అన్నదానం నిర్వహించడం వంటి చర్యలు ప్రజల్లో సానుకూల స్పందనను కలిగిస్తున్నాయి. తిరుమల పర్యటన అనంతరం, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.
Also Read: వొంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు… అన్నప్రసాదం, లడ్డూలు ఉచితం


