CM Chandrababu | భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రం హోం విధానానికి అవకాశం ఉండొచ్చని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి నిడమర్రులో బుధవారం నిర్వహించిన బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బైసర్) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ విధానాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంటి నుంచే పని చేసే విధానం మరింత విస్తరించనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త వాస్తవికతను అందరూ స్వీకరించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ పరిపాలనలోనూ భవిష్యత్తులో ఇలాంటి విధానాలకు అవకాశం ఉండొచ్చని తెలిపారు.
పొదుపు సూచనలు పాటించాలని పిలుపు..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఎనిమిది పొదుపు సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు ప్రజలూ ఆర్థిక బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన అన్నారు. దేశంలో దుబారా తగ్గాలని, కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని వ్యాఖ్యానించారు. భద్రతా ఏర్పాట్లను కూడా అవసరానికి తగ్గించుకోవాలనే సూచించారు.
Read Also : 2027 గోదావరి పుష్కరాలకు అన్నీ రెడీ — 10 కోట్ల భక్తులు, 373 స్నాన ఘాట్లు, ₹60 కోట్ల బడ్జెట్!
బంగారం కొనుగోళ్లపై ఆలోచనాత్మకంగా ఉండాలి..
విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్లపై ప్రజలు ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. స్వదేశీ పర్యాటకాన్ని పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. సూర్యలంకను గోవాకు పోటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వైద్య, విద్యా రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యాన్ని ఆయన స్పష్టం చేశారు. అమరావతి నుంచి ప్రపంచానికి వైద్య సిబ్బంది తయారయ్యే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బైసర్, కిమ్స్ సంస్థలు ఈ లక్ష్యానికి తోడ్పడతాయని అన్నారు. త్వరలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 250 మెడికల్ సీట్లు, విస్తృత నైపుణ్య శిక్షణతో లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
క్వాంటమ్ వ్యాలీ పనులు వేగంగా..
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా పనులు వేగంగా సాగుతున్నాయని సీఎం చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్ల ఉత్పత్తి స్థాయికి రాష్ట్రం చేరుతుందని అన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభించాయని వివరించారు. గత పాలకుల ఐదేళ్ల పాలనలో రాష్ట్రం నష్టపోయిందని విమర్శించిన చంద్రబాబు, తమ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. విద్యుత్ రంగంలో భారాలు మోపలేదని, భవిష్యత్తులో కూడా చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్..
ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వైద్య రంగానికి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. రాష్ట్రాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. విశాఖను అభివృద్ధి కేంద్రంగా, రాయలసీమను హార్టికల్చర్ మరియు టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని వివరించారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also : గుంటూరు ఎర్ర మిర్చి ట్రెండ్ వెనుక చరిత్ర… మిర్చి అసలు భారతీయ పంట కాదా?


