East Godavari Tiger Movement
-
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసరాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతూ, జాతీయ రహదారి సమీపంలో కెమెరాల్లో చిక్కింది.
-
అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిపుణుల బృందం, డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
-
ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేయగా, కొన్ని పాఠశాలలకు తాత్కాలిక సెలవులపై ప్రచారం జరుగుతోంది.
తూర్పుగోదావరి జిల్లా ప్రజలను పెద్దపులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతుండగా, తాజాగా ఈ పెద్దపులి కెమెరాల్లో చిక్కినట్లు సమాచారం. మంగళవారం రాత్రి స్థానికులు పులిని గుర్తించినట్లు చెబుతున్నారు. విశాఖపట్నం–విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పులి కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లు సమాచారం. కొందరు యువకులు పులి వీడియో తీశామని చెబుతుండగా, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పుణె నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రాజమహేంద్రవరానికి రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి పక్కన పులి కనిపించడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సమీపంలోని ఒక కొబ్బరి తోటలో కుటుంబం నివసిస్తున్న నేపథ్యంలో, పోలీసులు మరియు అటవీశాఖ అధికారులు వారితో మాట్లాడి ఇంటి బయటకు రాకూడదని సూచించారు.
తాత్కాలికంగా సెలవులు
ఇక పెద్దపులి సంచారంతో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు. కొన్ని పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచనలు జారీ చేశారు. అటవీశాఖ బృందాలు పులి జాడను కనిపెట్టి బంధించే చర్యలను వేగవంతం చేశాయి.
పెద్దపులి సంచారం ఎప్పుడు కనిపించింది అంటే..
- గత నెల 20వ తేదీ: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రాంతంలో పులి కనిపించిందనే ప్రచారం.
- గత నెల 31వ తేదీ: పులి గోదావరి నది దాటి సీతానగరం వైపు కదిలినట్లు సమాచారం.
- ఈ నెల 1వ తేదీ: సీతానగరం మండలం తొర్రేడులో రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేసి చంపిన ఘటన.
- ఈ నెల 2వ తేదీ: రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో పులి పాదముద్రల గుర్తింపు.
- ఈ నెల 3వ తేదీ ఉదయం: గాడాల ప్రాంతంలో పులి జాడ లభ్యం.
- మంగళవారం రాత్రి: ఆటోనగర్ మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కొబ్బరి తోట వైపు వెళ్లినట్లు స్థానికుల వాదనలు.
మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. అధికారులు డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.