ట్రాఫిక్ చలానా పేరిట వచ్చిన ఫేక్ లింక్‌పై క్లిక్ చేసిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఖాతా నుంచి రూ.12 లక్షలు క్షణాల్లో మాయమయ్యాయి.
ఈ ఘటనతో సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందనే విషయం స్పష్టమైంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త కొత్త పద్ధతులతో అమాయకులను మోసం చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఓ ప్రజాప్రతినిధి కూడా ఈ మోసానికి బలయ్యారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని భారీగా ఆర్థిక నష్టం చవిచూశారు.
ఎలా జరిగింది మోసం?
వివరాల్లోకి వెళితే, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొబైల్‌కు ఆర్టీఏ ట్రాఫిక్ చలానా పేరుతో ఓ సందేశం వచ్చింది. అందులో తన వాహనానికి సంబంధించిన పెండింగ్ చలానా ఉందని, వెంటనే చెల్లించాలని సూచిస్తూ ఓ లింక్‌ను పంపారు.
అది అధికారిక సందేశమేనని నమ్మిన ఎమ్మెల్యే, పెండింగ్ చలానా క్లియర్ చేసేందుకు ఆ లింక్‌ను క్లిక్ చేశారు.
ఏకంగా రూ.12 లక్షలు మాయం
అయితే, ఆ లింక్‌లో మాల్వేర్ దాగి ఉండటంతో, ఆయనకు తెలియకుండానే ఒక ప్రమాదకర యాప్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయింది. లింక్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ.12 లక్షలు మాయం అయ్యాయి.
Also Read: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం
బ్యాంక్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
తన ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు నియంత్రణలోకి తీసుకున్నారని గుర్తించిన వెంటనే ఆయన అప్రమత్తమై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
డబ్బులు జమ అయిన ఖాతాలను ట్రాక్ చేస్తూ, ఐపీ అడ్రస్ ట్రేసింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతులతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ చలానాలు, కేవైసీ అప్‌డేట్‌లు, గిఫ్ట్ వోచర్లు పేరుతో వచ్చే సందేశాల్లోని లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.
అధికారిక వెబ్‌సైట్లు, యాప్స్ ద్వారానే చెల్లింపులు చేయాలని సూచించారు.
అలాగే, ఎవరికైనా ఇలాంటి సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని, లేదా ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు తెలిపారు.


