ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి మరింత ఊపునిచ్చే కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ డేటా సెంటర్‌కు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం తర్లువాడలో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గూగుల్ ప్రతినిధులు హాజరయ్యారు.
శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆకర్షించింది. వెంటనే ఆయన చంద్రబాబు నుంచి ఫోన్ తీసుకుని, దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ మోడల్, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయన్న వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కూడా తన ఫోన్ గురించి వివరంగా చెప్పడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
ఆండ్రాయిడ్ ఫోన్..
ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్న మొబైల్ ఒక ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ ఫోన్‌గా తెలిసింది. అయితే అది ఏ కంపెనీకి చెందినది, ధర ఎంత అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫోన్‌ను మడతపెట్టే సౌకర్యం, ప్రత్యేకమైన డిజైన్ కారణంగా అశ్వినీ వైష్ణవ్ ఆసక్తిగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదే సభలో అశ్వినీ వైష్ణవ్, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా అభివర్ణించారు. గతంలో హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, సైబర్ టవర్స్ ద్వారా ఐటీ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తుచేశారు.
చంద్రబాబు విజన్‌కి సెల్యూట్..
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు నాయకత్వంలో విశాఖపట్నం త్వరలోనే ప్రధాన ఐటీ హబ్‌గా ఎదుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ నగరం ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు విజన్‌లకు తాను సెల్యూట్ చేస్తున్నానని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల కోసం భారీ నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం ఐటీ రంగంలో కొత్త దశను ప్రారంభించబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


