మదనపల్లె చిన్నారి హత్య కేసులో కీల‌క‌ మలుపు.. నిందితుడి మృత‌దేహం చెరువులో లభ్యం

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మదనపల్లె చిన్నారి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యువకుడు చెరువులో మృతదేహంగా లభ్యమవడంతో దర్యాప్తు మరింత వేగం అందుకుంది.

Police investigation at pond in Kurabalakota after suspect's body found in Madanapalle 7-year-old girl murder case
Police investigation at pond in Kurabalakota after suspect's body found in Madanapalle 7-year-old girl murder case

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న మదనపల్లె పట్టణంలో సంచలనం సృష్టించిన ఏడేళ్ల చిన్నారి హత్య కేసు మరో మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కురబలకోట మండలం కనసానివారిపల్లి సమీపంలోని చెరువులో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా, వెంటనే ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

డ్ర‌మ్‌లో మృత‌దేహం..

ఈ ఘటనకు మూడు రోజుల ముందు మదనపల్లె పట్టణ శివార్లలో నివసించే దంపతుల ఏడేళ్ల కుమార్తె అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఇంటి పక్కనే నివసించే కులవర్ధన్ బాలికను తన ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. విచారణలో అతడు బాలికను హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్‌లో దాచినట్లు బయటపడింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికుల ప్రకారం నిందితుడు గతంలోనూ పలుమార్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతడిపై పలు కేసులు కూడా నమోదయ్యాయని సమాచారం. మద్యం, గంజాయి అలవాట్లతో జులాయిగా తిరుగుతూ ఉండేవాడని పొరుగువారు చెబుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడి ఇంటి వద్ద స్థానికులు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని సమాధానపరిచి పంపించారు.

చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్..

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించి, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించారు. హోంమంత్రి వంగలపూడి అనిత బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా మదనపల్లెకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అయితే పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే నిందితుడు చెరువులో మృతదేహంగా లభ్యమవడం కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »