విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి పట్ల ప్లే స్కూల్ టీచర్ అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యాధరపురంలోని ఓ ప్రైవేట్ ప్లే స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.
బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి 23న చిన్నారిని సాధారణంగా స్కూల్ దగ్గర దింపి తల్లి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే స్కూల్ యాజమాన్యం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. బాత్‌రూమ్‌లో జారి పడిపోయిందని, వెంటనే వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన తల్లి వెంటనే స్కూల్‌కు చేరుకుంది. అక్కడ తన కుమార్తె ఏడుస్తూ ఉండటం చూసి ఆమె తీవ్రంగా కలత చెందింది.
గాయాలు చూసి షాకైన పేరెంట్స్..
చిన్నారి శరీరంపై ఉన్న గాయాలను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా చిన్నారిపై యాసిడ్ దాడి జరిగినట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
Also Read: చుక్కలనంటుతున్న విమాన టిక్కెట్ ధరలు.. ఇక హైదరాబాద్ చేరుకోవడం కష్టసాధ్యం
ఈ విషయం తెలుసుకున్న తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నించారు. అసలు ఏమి జరిగిందో నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం చివరికి జరిగిన విషయాన్ని ఒప్పుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే విషయం బయటకు రాకుండా ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని చెప్పి కేసును ముడిపెట్టేందుకు ప్రయత్నించిందని వారు చెబుతున్నారు.
రాజీ పడేందుకు ప్రయత్నించిన స్కూల్ యాజమాన్యం..
అంతేకాకుండా కొంత డబ్బు ఇచ్చి రాజీకి రావాలని కూడా స్కూల్ యాజమాన్యం కోరిందని, అయితే తాము అంగీకరించకపోవడంతో బెదిరింపులకు దిగిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన గురించి బయటకు చెబితే పరిణామాలు మంచివి కావని స్కూల్ ప్రిన్సిపాల్ హెచ్చరించారని వారు పేర్కొన్నారు. అలాగే డీసీపీ మా పరిచయస్తుడు అంటూ బెదిరింపులు చేశారని కూడా ఆరోపించారు.
చిన్నారి అని కూడా చూడకుండా ఇంత క్రూరంగా వ్యవహరించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. ఈ ఘటన బయటపడటంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారుల భద్రత విషయంలో స్కూళ్లు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.