ఆటోలో మరిచిపోయిన రూ.30 ల‌క్ష‌ల‌ బంగారం తిరిగి ఇచ్చిన డ్రైవర్… నిజాయితీకి ఎస్పీ ప్రశంసలు

ప్రయాణికులు ఆటోలో మరిచిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ నిజాయితీని జిల్లా ఎస్పీ అభినం

Ongole auto driver honesty

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక ఆటోడ్రైవర్ తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణికులు ఆటోలో మరిచిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడకు చెందిన సుబ్బారావు కుటుంబంతో కలిసి ఒంగోలు వచ్చారు. అక్కడ ఒక ఆటోలో ప్రయాణించి ఒక చోట దిగారు. అయితే హడావిడిలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. కొద్దిసేపటికి విషయం గుర్తించిన సుబ్బారావు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆటోడ్రైవర్ వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

ఇదిలాఉండగా ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు తన ఆటోలో ఒక బ్యాగ్ కనిపించడంతో అనుమానం వ్యక్తం చేశారు. అది తమ ఆటోలో దిగిన ప్రయాణికులదేనని భావించారు. వెంటనే ఆ చుట్టుపక్కల వారిని అడిగి ఆ బ్యాగ్ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును పోలీసులకు అప్పగించారు.

నిజాయితీకి అభినంద‌న‌లు..

పోలీసులు వెంటనే ఫిర్యాదు చేసిన సుబ్బారావుకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను ధృవీకరించి బాధితుడికి తిరిగి అప్పగించారు. ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు చూపిన నిజాయితీని అక్కడున్నవారు అభినందించారు.

Also Read: మినిమం బ్యాలెన్స్ పేరుతో రూ.19 వేల కోట్లు? – బ్యాంకులపై ప్రశ్నలు

తర్వాత ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆటోడ్రైవర్ నాగేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధంగా మరో ఆటోడ్రైవర్ ఖలీల్ కూడా ప్రయాణికులు మరిచిపోయిన బంగారాన్ని పోలీసులకు అప్పగించడంతో ఆయనను కూడా ఎస్పీ అభినందించారు.

ఆటోల‌కి డిజిట‌ల్ గుర్తింపు..

ఇక మరోవైపు ప్రకాశం జిల్లాలో ఆటోలకు డిజిటల్ గుర్తింపు కల్పించే విధానాన్ని పోలీసులు ప్రారంభించారు. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ట్రాఫిక్ డిజిటల్ నంబర్లతో కూడిన స్టిక్కర్లను ఆవిష్కరించారు. ప్రయాణికులు ఆటోల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేలా, సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

ఈ విధానంలో ప్రతి ఆటోకు ప్రత్యేక డిజిటల్ నంబర్ కలిగిన స్టిక్కర్ అమర్చుతారు. డ్రైవర్ వివరాలు, వాహనం సమాచారం వంటి వివరాలు ఇందులో ఉంటాయి. ప్రయాణికులు ఈ స్టిక్కర్లపై ఉన్న గుర్తింపును చూసి ఆటో వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అవసరమైన సమయంలో పోలీసులు కూడా ఈ వివరాల ఆధారంగా వేగంగా సమాచారం సేకరించగలరు.

ప్ర‌జ‌ల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించే ఆలోచ‌న‌..

డ్రైవర్‌కు సంబంధించిన వివరాలతో కూడిన ప్రదర్శన బోర్డు మరియు రెండు స్టిక్కర్లు ఇవ్వబడతాయి. ఈ స్టిక్కర్లను పొందేందుకు ఆటోడ్రైవర్లు లేదా యజమానులు తమ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వంటి పత్రాలను ట్రాఫిక్ పోలీసులకు సమర్పించాలి. ఆ వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ప్రత్యేక డిజిటల్ నంబర్‌తో కూడిన గుర్తింపు స్టిక్కర్‌ను అందిస్తారు. ఈ విధానం ద్వారా ఆటోలను సులభంగా గుర్తించడం, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, అలాగే ప్రజలకు మరింత భద్రత కల్పించడం లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »