ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉండగా బుధవారం ఉదయం ఆయన కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ ఘటన విశాఖపట్నం నగరంలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్న సమయంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ముందుగా వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు వేగాన్ని నియంత్రించలేక ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని చివరి వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికి గాయాలు కాలేదు. ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆ వాహనాల్లో లేకపోవడం.
ప్రమాదం తప్పింది..
పవన్ కళ్యాణ్ బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ నుంచి ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై దెబ్బతిన్న వాహనాన్ని పక్కకు తొలగించి, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది లేదా డ్రైవర్లకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
బిజీ షెడ్యూల్స్..
పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనే “ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026” వంటి కీలక అధికారిక కార్యక్రమాల్లో హాజరుకానున్నారు. కాన్వాయ్ ప్రమాదం కారణంగా ఆయన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అన్ని కార్యక్రమాల్లో ఆయన యథావిధిగా పాల్గొంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతుంది.