తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒకే నినాదం వినిపించింది #SavePunarvika (సేవ్ పునర్విక). ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికగా సాగిన ఈ భారీ క్రౌడ్ ఫండింగ్ ఉద్యమం విజయవంతమైంది. రూపాయి రూపాయి చేర్చి ప్రజలు చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్‌కుమార్, పుష్పావతి దంపతుల 11 నెలల కుమార్తె పునర్వికశ్రీకి SMA Type-1 (Spinal Muscular Atrophy Type-1) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారించారు. కోట్లలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ వ్యాధికి అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు అవుతుందని తొలుత చెప్పారు.
పేద కుటుంబానికి చెందిన సురేష్‌కుమార్ అంత భారీ మొత్తాన్ని సమకూర్చలేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని, అధికారులను ఆశ్రయించారు.
సోషల్ మీడియా మహాయజ్ఞం
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ విరాళాల సేకరణ ప్రారంభించారు. ముఖ్యంగా ‘ట్రావెల్ విత్ జగదీష్’ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కరే రూ.కోటిన్నరకుపైగా సేకరించడం విశేషం.
మొత్తం రూ.8,53,29,500 విరాళాల రూపంలో సేకరించగా, మిగిలిన సాయం ప్రభుత్వం నుంచి అందింది. ప్రస్తుతం ఈ మొత్తం చికిత్సకు సరిపోతుందని కుటుంబసభ్యులు తెలిపారు.
తండ్రి భావోద్వేగ వీడియో
పునర్విక ట్రీట్మెంట్‌కు అవసరమైన డబ్బులు సమకూరాయని పాప తండ్రి సురేష్‌కుమార్ వీడియో విడుదల చేసి ప్రకటించారు. ఇకపై ఎవరూ డబ్బులు పంపవద్దని, ఫండింగ్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.“అవసరమైన మొత్తానికి మించి డబ్బులు సేకరించాం. మిగిలిన మొత్తాన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇతర పిల్లల కోసం వినియోగిస్తాం. నేను రూపాయి కూడా వ్యక్తిగతంగా తీసుకోను” అని స్పష్టం చేశారు.
పాప ప్రస్తుతం ఆస్పత్రిలో ఉందని, నాలుగైదు రోజుల్లో ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు చెబుతామని తెలిపారు. మొదట చెప్పినట్లు రూ.16 కోట్లు కాకుండా, ఇంజెక్షన్ ఖర్చు రూ.10 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని కూడా వెల్లడించారు.
ప్రజల ఐక్యతకు ఉదాహరణ
ఒక చిన్నారి ప్రాణం కాపాడటానికి ప్రతి తెలుగువాడు ముందుకొచ్చాడు. ముఖ్యంగా యువత భారీగా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ మహాయజ్ఞం ప్రజల ఐక్యత, మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. #SavePunarvika క్యాంపెయిన్ ఇప్పుడు ఆశ, ఐక్యత, మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించాలనే ఆకాంక్షతో అందరూ ప్రార్థిస్తున్నారు.