ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు: విజయనగరం ఘటనలో నలుగురు మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, కృష్ణా, మార్కాపురం జిల్లాల్లోనూ జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ప్రధాన కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు.

Vizianagaram Road Accident
Vizianagaram Road Accident

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, ఇతర జిల్లాల్లోనూ జరిగిన ప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవించింది.

విజయనగరం జిల్లాలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు అతివేగంగా వెళ్తున్న ఒక కారు, పూసపాటిరేగ మండలం పేరాపురం జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీకొట్టిన కారు, అనంతరం ఒక లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతిచెందగా, రోడ్డు దాటుతున్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

భారీగా ట్రాఫిక్ జామ్..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా, 15 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉయ్యూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసి రక్షించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.

పోలీసుల ద‌ర్యాప్తు..

మరోవైపు మార్కాపురం జిల్లాలోని కంభం మండలం జంగంగుంట్ల వద్ద బైకును ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ వరుస ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్‌పై కట్టడి అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »