అత్తాపూర్ సుజుకి కార్ షోరూంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం…కాలి బూడిదైన కాస్ట్ లీ కార్లు.. తృటిలో తప్పిన భారీ విపత్తు

Attapur Suzuki Showroom Fire Accident: హైదరాబాద్ అత్తాపూర్‌లోని ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ షోరూంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సర్వీస్ సెంటర్ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటల‌లో ప‌లు కార్లు ద‌గ్ధం అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో చాలా ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఆ ప్రాంతంలోనే ఉన్న‌ అపార్ట్‌మెంట్ వాసులను ముందస్తుగా ఖాళీ చేయించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

Attapur Suzuki Showroom Fire Accident in Hyderabad
Attapur Suzuki Showroom Fire Accident in Hyderabad

Attapur Suzuki Showroom Fire Accident

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ల షోరూంలో అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 1:20 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో షోరూంలో సుమారు 50 నుంచి 70 వరకు కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ మంటలు పూర్తిగా వ్యాపించక ముందే అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో భారీ నష్టం తప్పింది.

స్క్రాప్ గోదాంలో మంటలు ..

ప్రాథమిక సమాచారం ప్రకారం, షోరూం సర్వీస్ సెంటర్‌లో ఉన్న స్క్రాప్ గోదాంలో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. అక్కడ నిల్వ ఉంచిన వ్యర్థ పదార్థాలు, వేస్ట్ ఆయిల్ డబ్బాలు, బ్యాటరీలు కలిసి ఉండటంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు నాలుగు నుంచి ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ నివాసులు మంటలను గమనించి వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్‌లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి స్పందించకపోయి ఉంటే భారీ అగ్నిప్రమాదంగా మారే అవకాశం ఉండేదని అధికారులు పేర్కొన్నారు.

ముందస్తు జాగ్రత్త చర్యగా సమీప అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సుమారు 90 కుటుంబాలను పోలీసులు తాత్కాలికంగా బయటకు పంపించారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేస్ట్ ఆయిల్స్, బ్యాటరీలు, ఇతర ప్రమాదకర పదార్థాలను ఒకేచోట నిల్వ చేయడం వల్లే మంటలు చెలరేగాయని వారు అంటున్నారు.

ఇక మరోవైపు, ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటించి ఉండొచ్చని షోరూం నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ అసలు కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అర్ధరాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »