హైదరాబాద్‌లో యూట్యూబర్‌ ప్రేమకథ విషాదాంతం… యువతి ఆత్మహత్యతో కలకలం

మూడేళ్ల ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువ యూట్యూబర్ కోమలి (21) హైదరాబాద్‌లోని మణికొండలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ విషాద నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

Hyderabad Love Tragedy-Suicide Case Investigation
Hyderabad Love Tragedy-Suicide Case Investigation

హైదరాబాద్ నగరంలో మరో ప్రేమకథ విషాదాంతమైంది. ప్రేమించిన యువకుడు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి (21) తన మామ ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన కోమలి, హైదరాబాద్‌లో మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్ టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించింది. ఇదే సమయంలో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తూ యూట్యూబర్‌గా కొనసాగుతున్న అఖిల్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి మూడేళ్ల పాటు కొనసాగింది.

ఒత్తిడికి లోనై..

అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి, కొన్ని నెలల క్రితం పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే కోమలి మాత్రం అఖిల్ రెడ్డిని మర్చిపోలేకపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్రేకప్ తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనై కొన్ని నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడినట్లు తెలిసింది.

ఇటీవల అఖిల్ రెడ్డితో మళ్లీ ఫోన్‌లో మాట్లాడిన సమయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి విషయమై మాట్లాడినప్పటికీ అఖిల్ రెడ్డి నిరాకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీర కట్టి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అఖిల్ రెడ్డి విచార‌ణ‌..

సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి యూట్యూబర్ అఖిల్ రెడ్డిని కూడా విచారణకు పిలిచి వివరాలు సేకరించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన సంబంధాలు, భావోద్వేగ బంధాలు ఎంతటి విషాదాలకు దారితీస్తున్నాయో ఈ సంఘటన మరోసారి చర్చనీయాంశమైంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »