యూట్యూబ్ సేవల్లో అంతరాయం.. వేలాదిమంది యూజర్లకు లాగిన్ సమస్యలు

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ YouTube సేవల్లో ఆకస్మిక అంతరాయం ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాగిన్ సమస్యలు, యాప్ ఓపెన్ కాకపోవడం, లైవ్ స్ట్రీమింగ్‌లో ఎర్రర్లు వంటి సమస్యలు విస్తృతంగా నమోదయ్యాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదు కావడం ఆందోళనకు గురిచేసింది.

YouTube app showing error message during global outage
YouTube app showing error message during global outage

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్( YouTube )సేవలు అకస్మాత్తుగా డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లాగిన్ సమయంలో ‘Something Went Wrong’ అనే ఎర్రర్ మెసేజ్ కనిపించడం, యాప్ సరిగా ఓపెన్ కాకపోవడం, వీడియోలు ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు యూజర్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు ఉపయోగించే ట్రాకింగ్ వెబ్‌సైట్ DownDetectorలో భారీగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 17న అమెరికాలో మాత్రమే యూట్యూబ్ లాగిన్ సమస్యలకు సంబంధించి 30 వేలకుపైగా రిపోర్టులు నమోదయ్యాయి. YouTube TV వినియోగదారుల నుంచి కూడా దాదాపు 10 వేల ఫిర్యాదులు వచ్చినట్లు డేటా సూచిస్తోంది.

అమెరికాలో పరిస్థితి

DownDetector డేటా ప్రకారం అమెరికాలో 56 శాతం మంది యూజర్లు YouTube యాప్‌తో సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. మరో 21 శాతం మంది వెబ్‌సైట్‌లో ఇబ్బందులు ఉన్నాయని, మిగిలిన 12 శాతం మంది లాగిన్ అవ్వడంలో సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. యాప్ ఓపెన్ అయినా వీడియోలు ప్లే కాకపోవడం, అకౌంట్ యాక్సెస్ కాకపోవడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.

భారతదేశంలో కూడా ప్రభావం

భారత్‌లో కూడా ఇదే తరహా సమస్యలు కనిపించాయి. సుమారు 71 శాతం మంది యూజర్లు యూట్యూబ్ యాప్ సరిగా పనిచేయలేదని రిపోర్ట్ చేయగా, 18 శాతం మంది లైవ్ స్ట్రీమింగ్‌లో అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. వీడియోలు బఫరింగ్ అవ్వడం, లాగిన్ లోపాలు రావడం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేశాయి.

ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినప్పటికీ యూట్యూబ్ సంస్థ నుంచి తక్షణ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ అంతరాయం వెనుక సాంకేతిక లోపమా, సర్వర్ సమస్యలా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే కొంతసేపటి తర్వాత సేవలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఆధారపడే ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »