ఏఐ టూల్స్‌తో భ‌య‌ప‌డుతున్నారా .. సాఫ్ట్‌వేర్ రంగానికి భారీ దెబ్బ ప‌డ‌నుందా.. టెక్ దిగ్గజాలు ఏం చెబుతున్నారంటే..!

కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే గూగుల్, ఎన్‌విడియా, ఆంథ్రోపిక్ సంస్థల అధినేతలు మాత్రం ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గవని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని భరోసా ఇస్తున్నారు.ఈ వార్త విని చాలా మంది సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

AI impact on software jobs and tech industry

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ప్రభావం అన్ని రంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విద్య, వైద్యం, ఫైనాన్స్, మీడియా నుంచి సాఫ్ట్‌వేర్ రంగం వరకు ఏఐ ఆధిపత్యం పెరుగుతుండటంతో కొందరిలో అనేక భ‌యాలు నెల‌కొన్నాయి. ముఖ్యంగా టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్‌లు జరుగుతుండటం, కొత్త ఏఐ టూల్స్ ప్రవేశించడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తమ ఉద్యోగ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో కూడా ఏఐ కంపెనీల ప్రభావం కారణంగా ఒడిదుడుకులు కనిపించడంతో ఈ ఆందోళన మరింత పెరిగింది.

అయితే ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల నాయకులు మాత్రం ఈ భయాలకు తావులేదని స్పష్టం చేస్తున్నారు. ఏఐ అనేది మనుషుల స్థానాన్ని తీసుకోవడానికి కాకుండా, వారి పనిని సులభతరం చేయడానికి వచ్చిన సాధనమని చెబుతున్నారు. ఉద్యోగాలు పోవడం కంటే కొత్త ఉద్యోగాలే ఎక్కువగా సృష్టించబడతాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్: రూ. 9,000 కోట్ల రుణానికి కసరత్తు!

టెక్ దిగ్గజాల కీలక వ్యాఖ్యలు

జెన్సన్ హువాంగ్ (ఎన్‌విడియా సీఈఓ మాట్లాడుతూ.. ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ నిపుణులకు ముప్పు అన్న వాదనను పూర్తిగా ఖండించారు. ఏఐ ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్, టూల్స్ ఆధారంగా పనిచేస్తుందని… స్వయంగా కొత్త సాంకేతికతను సృష్టించలేదని తెలిపారు. మానవ నైపుణ్యం లేకుండా ఏఐ ఉపయోగకరంగా ఉండదని స్పష్టం చేశారు.

సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) వివ‌రిస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగులు మరింత ఉత్పాదకతతో పనిచేయగలరని అభిప్రాయపడ్డారు. ఒకే విధమైన రిపిటేటివ్ పనులను ఆటోమేషన్ చూసుకుంటే… ఉద్యోగులు సృజనాత్మక పనులపై దృష్టి పెట్టగలరని చెప్పారు. గత 20 ఏళ్లుగా టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని అనుకున్నా, ప్రతి ఏడాది కొత్త అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. గూగుల్‌లో సుమారు 30% కోడింగ్ ఏఐ సహాయంతోనే జరుగుతోందని, దీని వల్ల కొత్త ఉత్పత్తుల అభివృద్ధి వేగవంతమవుతోందని తెలిపారు.

డేనియెల్ అమోడెయ్ (ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకురాలు) త‌న అభిప్రాయం తెలియ‌జేశారు. ఏఐ వల్ల కోడింగ్ ప్రాధాన్యత మారొచ్చు కానీ ఉద్యోగాల అవసరం తగ్గదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేవలం టెక్నికల్ స్కిల్స్ కాకుండా కమ్యూనికేషన్, క్రియేటివిటీ, లెర్నింగ్ మైండ్‌సెట్ ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని వివరించారు. భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యం, సానుకూల దృక్పథం ఉన్నవారు ఏఐ రంగంలో మరింత కీలకంగా మారతారని చెప్పారు.

ఏఐతో – ముప్పా? లేక అవకాశాలా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏఐ అనేది ఉద్యోగాలను తొలగించే శక్తి కాకుండా, పనుల స్వభావాన్ని మార్చే సాధనం. భవిష్యత్తులో సాధారణ కోడింగ్ కంటే క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనలిసిస్, డిజైన్ థింకింగ్, హ్యూమన్ ఇంటరాక్షన్ వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరగనుంది.

సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారు కొత్త టూల్స్ నేర్చుకోవడం, ఏఐతో కలిసి పని చేసే నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మరింత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మొత్తానికి, ఏఐ భయంకర శత్రువు కాదని… సరైన విధంగా ఉపయోగిస్తే అది కెరీర్‌కు బలమైన మిత్రుడిగా మారుతుందని టెక్ దిగ్గజాలు తెలియ‌జేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »