ఐటీ రంగానికి ఊరట.. లాభాల్లో దూసుకుపోతున్న టీసీఎస్‌, ఉద్యోగులకు వేతనం పెంపు

అనిశ్చిత పరిస్థితుల్లో కూరుకుపోయిన ఐటీ రంగానికి టీసీఎస్ శుభవార్త చెప్పింది. లాభాలు పెరగడమే కాకుండా ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించడం రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చింది.

TCS office building and happy IT professionals representing the 2026 salary hike and financial growth.
Image Credit: The Times of India

గత కొంత కాలంగా భారతీయ ఐటీ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అమెరికా విధానాలు, గ్లోబల్ ఆర్థిక మందగమనం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం కారణంగా ఐటీ కంపెనీలు అనిశ్చితిలో పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, దిగుమతి సుంకాల పెంపు, ఐటీ కంపెనీలపై కఠిన నియంత్రణలు, హెచ్1బీ వీసా ఫీజుల పెంపు ఇవి అన్నీ కలిసి భారత ఐటీ రంగంపై ప్రభావం చూపించాయి.

ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా ఐటీ రంగానికి సవాలుగా మారాయి. ముఖ్యంగా Claude AI వంటి ఆధునిక టూల్స్ ఐటీ సేవల డిమాండ్‌ను తగ్గిస్తాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు లాభాల్లో తగ్గుదల, నియామకాల తగ్గింపు, వేతనాల వాయిదా వంటి చర్యలకు దిగాయి.

గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్(TCS)..

అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని అగ్రగామి ఐటీ సంస్థ Tata Consultancy Services (టీసీఎస్) మాత్రం ఆశాజనక ఫలితాలను నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) ఫలితాలను ప్రకటించిన టీసీఎస్, నికర లాభాన్ని 12 శాతం పైగా పెంచుకుని రూ.13,718 కోట్లకు చేర్చింది. అలాగే సంస్థ కార్యకలాపాల ఆదాయం కూడా 9 శాతం పెరిగి రూ.70,698 కోట్లకు చేరింది.

ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు కూడా టీసీఎస్ శుభవార్త తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.31 ఫైనల్ డివిడెండ్‌ను ప్రకటించింది. ఇదే సమయంలో ఉద్యోగులకు మరింత ఉత్సాహాన్ని కలిగించే నిర్ణయం కూడా వెల్లడించింది.

ఏప్రిల్ 1 నుండే పెంపు..

టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ అధికారి మిలింద్ ల‌క్క‌డ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుంచే వేతన పెంపు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పెంపు అన్ని గ్రేడ్ల ఉద్యోగులకు వర్తిస్తుందని వెల్లడించారు. గతంలో 4.5% నుంచి 7% వరకు ఉన్న వేతన పెంపు ఈసారి మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని సూచించారు. ముఖ్యంగా టాప్ పెర్ఫార్మర్లకు డబుల్ డిజిట్ శాతం వృద్ధి లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఇప్పటికే ఉద్యోగుల స్వచ్ఛంద వలస రేటు 13.7%గా నమోదైందని, వేతన పెంపుతో ఇది మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే క్యాంపస్ నియామకాలను కొనసాగిస్తామని టీసీఎస్ వెల్లడించింది.

ఐటీ రంగానికి నూతన ఉత్సాహం..

గత ఏడాది ఐటీ కంపెనీలు వేతన పెంపులను వాయిదా వేయడం, తక్కువ శాతంలో అమలు చేయడం, కొన్ని చోట్ల పూర్తిగా నిలిపివేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగానికి నూతన ఉత్సాహాన్ని నింపినట్లైంది.

టీసీఎస్ తాజా ఫలితాలు, వేతన పెంపు ప్రకటనతో ఐటీ రంగంలోకి రావాలనుకునే వారికి కొంత భరోసా లభించింది. త్వరలో ఇతర ప్రధాన ఐటీ సంస్థలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: ఐపీఓకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాల కోతలు.. ఏకంగా 300 మందికి గుడ్‌బై?

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »