ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచిన యాపిల్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత సీఈఓ టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన పూర్తిగా సంస్థను వీడకుండా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
టిమ్ కుక్ స్థానంలో కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ నియమితులయ్యారు. ప్రస్తుతం యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టెర్నస్, 2026 సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. 2001లో యాపిల్‌లో చేరిన ఆయన, మ్యాక్ కంప్యూటర్లు, ఐపాడ్స్, ఎయిర్‌పాడ్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తెరవెనుక నిశ్శబ్దంగా పనిచేస్తూ కంపెనీ ఎదుగుదలకు బలమైన ఆధారంగా నిలిచిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.
మరింత దూకుడుగా..
ఈ నాయకత్వ మార్పుతో యాపిల్ తన వ్యూహాలను మరింత దూకుడుగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హార్డ్‌వేర్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువలో అగ్రస్థానంలో ఉన్న చిప్ దిగ్గజం ఎన్విడియాతో పోటీకి సిద్ధమవుతోంది.
టిమ్ కుక్ ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఆయన నాయకత్వం యాపిల్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అనారోగ్యం కారణంగా 2011లో సీఈఓ పదవి నుంచి తప్పుకోవడంతో, ఆ బాధ్యతలు కుక్‌కు అప్పగించబడ్డాయి. దాదాపు 15 సంవత్సరాల పాటు సంస్థను విజయవంతంగా నడిపిన ఆయన హయాంలో యాపిల్ షేర్ విలువ 20 రెట్లు పెరగడం విశేషం.
కొత్త నాయకత్వంలో..
ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ సుమారు రూ. 373 లక్షల కోట్లకు చేరుకోవడం, టిమ్ కుక్ నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. ఒకప్పుడు దివాలా అంచున ఉన్న సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర అపారమని చెప్పాలి.
ఇప్పుడు జాన్ టెర్నస్ నేతృత్వంలో యాపిల్ కొత్త దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. ఈ మార్పు సంస్థ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
Also Read:


