అబుదాబి ఎయిర్‌పోర్టు సమీపంలో ఇరాన్ దాడి .. తెలంగాణ వ్యక్తికి గాయాలు, టెన్ష‌న్ ప‌డుతున్న కుటుంబం

ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో తెలంగాణకు చెందిన రాజేశ్వరరావు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుడిని సు

abu dhabi airport attack

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు కొనసాగిస్తోంది. ఈ పరిణామాల ప్రభావం గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయులపై కూడా పడుతోంది.

తాజాగా అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ జరిపిన దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. ఈ విషయం అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Also Read: వరంగల్ KMCలో షాకింగ్ పరిస్థితి – 18 నెలలుగా OTలు మూత!

సిరిసిల్లకు చెందిన వ్యక్తి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. రాజేశ్వరరావు అబుదాబి విమానాశ్రయంలో హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. గత ఏడాది నుంచి అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇటీవల జరిగిన దాడిలో తాను స్వల్పంగా గాయపడినట్లు రాజేశ్వరరావు తన తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా తెలిపినట్లు ఆయన తండ్రి ప్రభాకర్ రావు చెప్పారు. అయితే గాయాలను మాత్రం చూపించలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన

నా కొడుకు ఏడాదిగా అక్కడ పనిచేస్తున్నాడు. దాడిలో అతనికి గాయాలు అయ్యాయని చెప్పాడు. వీడియో కాల్‌లో మాతో మాట్లాడాడు కానీ గాయాలను చూపించలేదు. మా కొడుకు సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నాం అని ప్రభాకర్ రావు తెలిపారు.

అలాగే తమ కుమారుడిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇక గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొందరు భారతీయులు ఇప్పటికే స్వదేశానికి తిరిగి వస్తున్నారు. జెడ్డా నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికులు రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితుల వల్ల తమకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదని వారు మీడియాకు తెలిపారు.

యుద్ధ ఉద్రిక్తతలు

ఇక శనివారం రోజు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖ‌మేనీ మరణించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తూనే సౌదీ అరేబియా, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాల్లోని లక్ష్యాలపై కూడా క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు కొనసాగుతున్నాయి.

ఈ పరిస్థితులతో గల్ఫ్ ప్రాంతంలో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమవడంతో అనేక దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »