ఆశా వర్కర్ల ఆందోళన ఉధృతి… చలో హైదరాబాద్‌కు బయల్దేరిన వారిపై అరెస్టులు

ఉద్యోగ భద్రత కోసం పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసనలు, పోలీసుల అడ్డంకులపై ఆగ్రహం

Asha Workers Protest
Asha Workers Protest

తెలంగాణలో ఆశా వర్కర్ల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో “చలో హైదరాబాద్”కు పిలుపునిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.

హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఆశా వర్కర్లు నిరసన చేపట్టగా, అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే కూడా పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు

చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా రేణికుంట టోల్ గేట్ వద్ద ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో దాదాపు 200 మందిని రాత్రికిరాత్రే అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.

వనపర్తి జిల్లాలో కూడా పలువురిని ముందస్తుగా అరెస్టు చేశారు. పెద్దమందడి, రేవల్లి, ఘన్‌పూర్, గోపాల్‌పేట, వనపర్తి రూరల్ మరియు టౌన్ ప్రాంతాల్లో పలువురు ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. నారాయణపేట జిల్లాలో కూడా 11 మంది ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.


నేతల అరెస్టుపై ఆగ్రహం

బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, కార్యదర్శి మారయ్యలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇప్పటికే ర్యాలీకి అనుమతులు ఇచ్చినప్పటికీ, తర్వాత అరెస్టులు చేయడం ఎందుకని ఆశా వర్కర్లు పోలీసులను నిలదీశారు.

ఇందిరాపార్క్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ, ఆ అనుమతిని పాటించకుండా పోలీసులు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. మహిళల హక్కులు, గౌరవం ఎక్కడ అని ఆశా వర్కర్లు ప్రశ్నిస్తున్నారు.

ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి ఉద్యోగ భద్రత, వేతనాలు, పని పరిస్థితులు మెరుగుపడకపోతే ఆరోగ్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో వారి డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశముంది. ప్రభుత్వం ఈ సమస్యపై త్వరగా స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ‘CM బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’లో మెనూ రేట్లు ఫిక్స్ – 6 రోజులకు ₹720

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »