శంషాబాద్/హైడరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, అచ్చమైన ‘రాక్షస పాలన’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. పరిగి భూసేకరణ బాధితులను కలిసేందుకు వెళ్తుండగా తనను అక్రమంగా అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు.
హరీష్ రావు విమర్శల్లోని ముఖ్యాంశాలు:
1. గడీల పాలన – బేడీల పాలన:
“నాడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అని చెప్పి.. నేడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన. రాష్ట్రంలో పూర్తిగా పోలీసు రాజ్యం నడుస్తోంది. రైతులను కలవకుండా అరెస్టులు చేయడం దౌర్జన్యం” అని ధ్వజమెత్తారు.
2. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే:
రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని హరీష్ రావు విమర్శించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో పోరాటం ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
3. రేవంత్ రెడ్డి అంటేనే ‘రావణాసురుడు’:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలతో హరీష్ రావు విరుచుకుపడ్డారు. “రేవంత్ రెడ్డిని మించిన రావణాసురుడు ఇంకెవరు ఉండరు. పేదల ఇళ్లను కూలుస్తూ వికృతానందం పొందుతున్నారు. రాష్ట్రంలో ఎవర్ని అడిగినా.. అది అవ్వాతాతలైనా, మహిళలైనా, విద్యార్థులైనా.. రేవంత్ అంటేనే రాక్షసుడు అని చెబుతున్నారు” అని పేర్కొన్నారు.
4. ఆరు గ్యారెంటీలు.. అన్నీ మోసాలే:
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
“వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్టే!”
రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తాను అనుకోవడం పగటి కల అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
“వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు. కేవలం సింగిల్ డిజిట్ సీట్లతోనే ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వస్తుంది.”
“రేవంత్ రెడ్డి అంటే అయిపోయిన కథ. మళ్ళీ తెలంగాణలో వచ్చేది కేసీఆర్ రాజ్యం.. రామ రాజ్యం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


