వికారాబాద్/హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల భూమిని సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు పరిగి పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది.
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత:
కాడ్లాపూర్ గ్రామ రైతులు, గ్రామస్తులు తమ భూమిని కాపాడుకోవాలని చేపట్టిన రిలే నిరవధిక దీక్షకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలపాల్సి ఉంది. ఈ పర్యటనకు అనుమతి కోరేందుకు రైతులు పరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు అనుమతి నిరాకరించారు.
గేట్లు ఎక్కి ఆందోళన: శాంతియుత నిరసనకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ రైతులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు స్టేషన్ గేట్లు మూసివేయడంతో ఆగ్రహించిన రైతులు గేట్లు ఎక్కి నిరసన తెలిపారు.
రైతుల అరెస్ట్: గొడవ సర్దుమణిగేందుకు పోలీసులు కొంతమంది రైతులను, గ్రామస్తులను స్టేషన్ లోపలే నిర్బంధించారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం:
రైతులకు బాసటగా నిలిచేందుకు పరిగి పర్యటనకు సిద్ధమైన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు ఆయన నివాసంలోనే అడ్డుకున్నారు.
హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితర నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
ప్రభుత్వానిది పిరికిపంద చర్య: కేటీఆర్ ఆగ్రహం
నేతల అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
బ్రేకింగ్ న్యూస్
మద్దతుగా హరీష్ రావు వస్తున్నాడని అనుమతి ఇవ్వకుండా రైతులను పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీసులు
పోలీస్ స్టేషన్ ముందు కాళ్లాపూర్ రైతులు, గ్రామస్తుల ఆందోళన
రేవంత్ రెడ్డి భూ దాహానికి తమ 1200 ఎకరాలు పోతున్నాయని రైతులు చేస్తున్న రైతుల రిలే నిరవదిక దీక్షకు… pic.twitter.com/jXQSz3uTA9
— Harish Reddy (@HarishReddyRDM) April 7, 2026
భూములపై పడ్డారు: “అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసి, ఇప్పుడు పేదల భూములపై పడింది. ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ ప్రభుత్వం, భూములను లాక్కోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోంది” అని కేటీఆర్ విమర్శించారు.
ప్రజాస్వామ్య ఖూనీ: ప్రశ్నించే గొంతులను పోలీసులతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


