హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించేలా జాతీయ రహదారి 65ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు రూ.10,391 కోట్ల మెగా ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ముఖచిత్రాన్ని మార్చే కీలక అడుగు పడింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానించే అత్యంత రద్దీ మార్గమైన నేషనల్ హైవే National Highway 65ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 231 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.10,391 కోట్లు కాగా, పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి 4.5 నుంచి 5 గంటలు పడుతుండగా, విస్తరణ తర్వాత అదే దూరాన్ని కేవలం 2.5 నుంచి 3 గంటల్లో పూర్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు 60,000 నుంచి 80,000 వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి.
ఏమేం మారబోతున్నాయి?
ఈ విస్తరణ కేవలం రోడ్డు వెడల్పు చేయడమే కాదు, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంపై కూడా దృష్టి సారించారు. నల్గొండ, సూర్యపేట, కోదాడ, నందిగామ వంటి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొత్త బైపాస్‌లను నిర్మిస్తున్నారు. స్థానిక వాహనాల రాకపోకల వల్ల హైవేపై రద్దీ పెరగకుండా దాదాపు అన్ని విభాగాల్లో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు కీలక జంక్షన్ల వద్ద అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పాదచారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయం
సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన ప్రయాణం ఒక గంటలో పూర్తవుతుంది. అయితే ఎయిర్‌పోర్ట్ చేరుకోవడం, చెక్-ఇన్, భద్రతా తనిఖీలు కలిపితే మొత్తం ప్రయాణ సమయం సుమారు 4 గంటలు పడుతుంది. కొత్త 6 లైన్ల రహదారి అందుబాటులోకి వస్తే ఇంటి నుంచి కారులో బయలుదేరి 2.5 గంటల్లో విజయవాడ చేరుకోవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.
రాజకీయ ప్రాధాన్యత
ఈ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరుపుతూ పనులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ ముద్ర వేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రా మూలాలున్న ప్రజలకు ఈ హైవే ఒక భావోద్వేగ అనుసంధానంగా ఉంది. ప్రాజెక్టు పూర్తయితే రాజకీయ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
డీపీఆర్ పూర్తి.. టెండర్లు తుది దశలో
National Highways Authority of India (NHAI) ఇప్పటికే డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను పూర్తి చేసింది. టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పనులు ప్రారంభమైన తర్వాత రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా సమగ్ర ప్రణాళికతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సామాజిక అనుసంధానం మరింత బలపడనుంది.

