తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కామారెడ్డి పర్యటనకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం, కామారెడ్డిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేమని తెలిపారు.
అయితే ఏ పరిస్థితుల్లోనైనా కామారెడ్డికి వెళ్తానని రాంచందర్ రావు స్పష్టం చేశారు. హౌస్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే భారీగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
బండి సంజయ్ ఆగ్రహం
ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం “రౌడీ రాజ్యం” నడుపుతోందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరగడం హేయమని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని ఆరోపించారు. బాన్సువాడలో 70 మంది కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఎంఐఎం నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా విమర్శించారు. రాళ్ల దాడులు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు.
కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే సవాల్
మరోవైపు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా స్పందించారు. అక్రమాలను అడ్డుకుంటున్నందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే వెంటనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
అరోరా కాలేజీలు, శిశుమందిర్ భూముల వ్యవహారం అందరికీ తెలిసిన విషయమేనని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామన్న వారికి, తానే స్వయంగా వస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు.
ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ ఆరోపణలు, ప్రతిఆరోపణల మధ్య పరిస్థితి ఎలా మలుపుతీసుకుంటుందో చూడాలి.