వెలుగుమట్ల బాధితుల పక్షాన కవిత ఆందోళన.. రోడెక్క‌డంతో ఖ‌మ్మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌..

ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జెడ్పీ సెంటర్ వ

Kavitha Visits Khammam Velugumatla demolition Victims

ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద బాధితులతో కలిసి ఆమె బైఠాయించడంతో భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధితులు తమ సమస్యలను వివరించగా, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత నిరసనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం ఆర్డీవో కవితతో చర్చలు జరిపినప్పటికీ, ఆమె తన పట్టు వీడలేదు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి బాధితులకు హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో ఉన్న చోటే ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను కోరారు. కలెక్టర్ స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.

అత్యంత అమానుషం అన్న క‌విత‌..

ఈ సందర్భంగా ఆమె స్థానిక మంత్రులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల పుస్తకాలతో సహా ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదని, అలాంటిది ఇంతమంది మహిళల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని అన్నారు. పేదల ఉసురు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు తప్పకుండా తగులుతుందని ఆమె హెచ్చరించారు.

Also Read: మల్కాజ్‌గిరి ట్రాఫిక్ సమస్యలకు చెక్..! “రైల్వే గేట్ ఫ్రీ మల్కాజ్‌గిరి”

రాష్ట్రంలో పేదల ఇళ్లపైనే జులుం జరుగుతోందని కవిత ఆరోపించారు. పెద్దల భవనాలపై బుల్డోజర్లు వెళ్లకపోయినా పేదల ఇళ్లపై మాత్రం దాడి చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు. పేదలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె స్పష్టం చేశారు.

త‌ప్పుల‌ని కప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేసుకుంటుందా..

గతంలో వెలుగుమట్ల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని కవిత వ్యాఖ్యానించారు. బాధితుల సమస్యను కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ప్రదర్శనలా చూసి వెళ్తున్నాయని, కానీ తాను మాత్రం సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అన్నారు.

బాధితులను ఒక చోటుకు తరలించి కనీస వసతులు కూడా కల్పించకుండా ఉంచారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు అవసరమైన సౌకర్యాలు, ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎవరికీ బాధితుల సమస్యలు పట్టడం లేదని కవిత విమర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటివరకు బాధితులను పరామర్శించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె అన్నారు.

మా డిమాండ్ ఒక్క‌టే..

మా డిమాండ్ ఒక్కటే అని కవిత స్పష్టం చేశారు. ఎక్కడైతే పేదల ఇళ్లను కూల్చివేశారో అదే స్థలంలో వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు వెళ్లమంటే తాము అంగీకరించబోమని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీలు, ధర్మ సమాజ్ పార్టీ మరియు ఇతర ప్రజా సంఘాలతో కలిసి సమగ్ర కార్యాచరణతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని కవిత ప్రకటించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »