- మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్స్ ప్రారంభం
- హనుమకొండ, పడిగాపూర్ నుంచి మేడారం వరకు జాయ్ రైడ్, అప్‌డౌన్ సేవలు అందుబాటులోకి
- ఆకాశం నుంచే సమ్మక్క–సారలమ్మ జాతరను వీక్షించే అరుదైన అనుభూతి భక్తులకు
సమ్మక్క–సారలమ్మ కొలువైన మేడారం మరోసారి భక్తజన గుడారంగా మారింది. మహాజాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం చేరుకుని వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కితే వరమిచ్చే సమ్మక్క–సారలమ్మలకు భక్తులు బంగారం సమర్పిస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. అడవుల మధ్య కొలువైన ఈ పవిత్ర స్థలం భక్తుల నినాదాలతో, పూజలతో మార్మోగుతోంది.
ఈ నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలో భక్తులకు మరింత సౌకర్యం, ప్రత్యేక అనుభూతి కల్పించేందుకు టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం మహాజాతర సందర్భంగా హెలికాప్టర్ రైడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి మేడారం వరకు ఏరియల్ వ్యూ (విహంగ వీక్షణ) కోసం ఈ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు.
#WATCH | Mulugu: The Telangana State Tourism Department, in collaboration with Thumby Aviation, has launched helicopter services for devotees attending the Medaram Sammakka Sarakka Jatara 2026, scheduled to take place from January 28 to 31, 2026, in Mulugu district. (22.01)… pic.twitter.com/tliNeYliPm
— ANI (@ANI) January 22, 2026
ఆకాశం నుంచే మేడారం మహాజాతర దర్శనం
భక్తులు ఈరోజు నుంచే హెలికాప్టర్ రైడ్స్‌ను వినియోగించుకోవచ్చు. పడిగాపూర్ వద్ద ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అడవులు, భక్తుల గుంపులు, జాతర వాతావరణాన్ని ఆకాశం నుంచి వీక్షించే అవకాశం ఈ సేవల ద్వారా లభించనుంది. ముఖ్యంగా వృద్ధులు, సమయం తక్కువగా ఉన్న భక్తులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
హనుమకొండ నుంచీ మేడారం వరకు ప్రత్యేక సేవలు
మేడారం వచ్చే భక్తుల కోసం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో మరో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మేడారం వరకు అప్‌డౌన్ హెలికాప్టర్ సేవలు జనవరి 22 (గురువారం) నుంచి పదిరోజుల పాటు అందుబాటులో ఉంటాయని టూరిజం శాఖ తెలిపింది. జాతర దృశ్యాలను ఆకాశం నుంచి తిలకించే అవకాశం కూడా ఇందులో భాగమే.
హెలికాప్టర్ రైడ్స్ వివరాలు :
జాయ్ రైడ్ (విహంగ వీక్షణ):
వ్యవధి: 6–7 నిమిషాలు
ఒక్కొక్కరికి ఛార్జీ: రూ.4,800
హనుమకొండ – మేడారం అప్‌డౌన్ రైడ్:
ఒక్కొక్కరికి ఛార్జీ: రూ.35,999
సేవల సమయం:
ఉదయం 8.00 గంటల నుంచి
సాయంత్రం 5.20 గంటల వరకు
సేవల కాలపరిమితి:
జనవరి 31 వరకు
ప్రధాన హెలిప్యాడ్లు:
పడిగాపూర్ (మేడారం సమీపంలో)
హనుమకొండ – ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్
సంప్రదింపు వివరాలు :
హెలికాప్టర్ రైడ్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, బుకింగ్ వివరాల కోసం భక్తులు కింది నంబర్లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఫోన్ నంబర్లు: 8530004309, 9676320139
మొత్తానికి, మేడారం మహాజాతరలో ఈసారి భక్తులకు భక్తి, దర్శనం మాత్రమే కాకుండా… ఆకాశం నుంచే జాతరను వీక్షించే అరుదైన అనుభూతిని కూడా టూరిజం శాఖ అందిస్తోంది. ఇది మేడారం జాతరకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.