తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి పీక్స్‌లో… అక్క‌డ అంద‌రి ఇళ్ల‌లో కొత్త టీవీలు, ఫ్రిజ్‌లు ..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశలో తాయిలాల పంపిణీ ఆరోపణలు జోరుగా వినిపిస్తుండగా ఓటర్లలో చర్చనీయాంశమవుతోంది.

Telangana Municipal Elections 2026 Campaign

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు సాయంత్రంతో అధికారిక ప్రచారానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు ఉదయం వేళల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గుంపులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా, రాత్రి వేళల్లో సన్నిహితులతో కలిసి ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు కావాల‌ని కోరుతున్నారు.

రాత్రి వేళల్లో తాయిలాల రాజకీయాలు

ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ‘అసలు’ ప్రచారం మొదలైందనే చర్చలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పలు ప్రాంతాల్లో తాయిలాల పంపిణీ కూడా జోరుగా సాగుతోందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఓటర్ల కాళ్లు మొక్కుతూ, వారికి కావాల్సిన గిఫ్ట్‌లు అందజేస్తూ మద్దతు కోరుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకరపల్లి, షాద్‌నగర్ మున్సిపాలిటీలతో పాటు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అలియాబాద్, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, ఇస్నాపూర్ ప్రాంతాల్లో ఓట‌ర్ల‌ని ఆకర్షించేందుకు బాగానే ఖ‌ర్చు పెడుతున్నార‌ని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

Also Read: రికార్డు స్థాయిల నుండి దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట!

మొయినాబాద్‌లో ఎలక్ట్రానిక్ తాయిలాల హడావిడి

మొయినాబాద్ మున్సిపాలిటీలో ఓ వార్డు అభ్యర్థి ఓటు అడగడానికి వెళ్లిన ఇంట్లో పాత టీవీ కనిపించడంతో వెంటనే కొత్త టీవీ ఏర్పాటు చేయించాడనే ప్రచారం చర్చనీయాంశమైంది. దీనికి ప్రతిగా ప్రత్యర్థి అభ్యర్థి అదే ఇంటికి కొత్త ఫ్రిజ్ అందించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సురంగల్ ప్రాంతంలో అనేక ఇళ్లలో కొత్త టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కనిపిస్తున్నాయనే వ్యాఖ్యలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి.

శంకరపల్లి మున్సిపాలిటీలో కొంతమంది అభ్యర్థులు టోకెన్ అమౌంట్‌గా రూ.5 వేల చొప్పున నగదు పంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్లీ వచ్చి మరికొంత డబ్బు ఇస్తామని హామీ ఇస్తూ ఓటర్ల నుంచి ప్రమాణాలు తీసుకుంటున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మహిళలకు చీరెలు, మిక్సీలు, నగదు పంపిణీ చేస్తున్నారనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఓటర్లు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ఎన్నికల తర్వాత వాటిని తిరిగి అడగరాదనే భరోసా తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆ హక్కును వదులుకోవడం సమాజానికి హానికరం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేడిలో తాయిలాల ప్రలోభాలకు లొంగకుండా అభ్యర్థుల పనితీరు, నమ్మకాన్ని పరిశీలించి ఓటు వేయాలని మేధావులు సూచిస్తున్నారు. ప్రజల నిర్ణయమే స్థానిక పాలన దిశను నిర్ణయించే కీలక అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »