నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఘటన సంచలనం రేపింది. పరీక్షా కేంద్రాల సిబ్బంది పాత్ర బయటపడడంతో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
తెలంగాణలో కొనసాగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షలలో లీక్ కలకలం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రశ్నపత్రం లీక్ ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తుంది. బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రం బయటకు రావడం చర్చనీయాంశమైంది. ప్రాథమిక విచారణలో ఈ లీక్ వెనుక పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు టీచర్లు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే…
సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైంది. అయితే ఆలూరు, మెండోరా పరీక్షా కేంద్రాల నుంచి ప్రశ్నపత్రం ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది. దీంతో అవి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
విద్యార్థులకు సమాధానాలు అందించాలనే ఉద్దేశంతోనే కొందరు ఇన్విజిలేటర్లు ఈ చర్యకు పాల్పడినట్లు విద్యాశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రశ్నపత్రాలను బయట ఉన్నవారికి పంపించి సమాధానాలు పంపమని కోరినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
అధికారుల స్పందన
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఏ కృష్ణారావు స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఒక వాట్సాప్ గ్రూప్‌లో పేపర్ లీక్ అయినట్లు మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో గుర్తించినట్లు తెలిపారు.
ఈ విషయంపై ఎంఈవోలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు వెంటనే దర్యాప్తు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. విచారణలో కొంతమంది ఇన్విజిలేటర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సస్పెన్షన్ వివరాలు:
మొదటగా తొమ్మిది మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని నిర్ణయించిన అధికారులు, తర్వాత విచారణలో బోధన్లోని పరీక్షా కేంద్రం నుంచి పేపర్ లీక్ కాలేదని తేలడంతో ఇద్దరిపై చర్యలు రద్దు చేశారు. ప్రస్తుతం ఏడుగురు టీచర్లు సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. వీరిలో ఇద్దరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు:
పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకురావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కొందరు టీచర్లు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సరైన తనిఖీలు లేకపోవడం కూడా ఈ ఘటనలకు కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో పరీక్షల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తగా, భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
Also Read: కరీంనగర్‌లో ఏసీబీ దాడులు… ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, టీచర్ అరెస్ట్


