తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారం గ్రామ శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో ఎన్‌హెచ్ 44పై ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడడంతో. నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టూరిస్ట్ బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే గన్నారం గ్రామ శివారులోని బ్రహ్మంగారి ఆలయం సమీపానికి చేరుకున్న సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు చాలామందికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు అప్రమత్తమై బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అనంతరం వెంటనే పోలీసులకు మరియు అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
నలుగురు అక్కడికక్కడే మృతి
ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు బోల్తా పడిన సమయంలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం. వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందాలు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఎంతగానో శ్రమించాయి. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ ,ఇతర సాంకేతిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. మృతుల గుర్తింపు మరియు ప్రమాదానికి గల అసలు కారణాలపై మరింత సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.