జోగులాంబ గద్వాల్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్ నుంచి అనంతపూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎన్‌హెచ్–44పై బోల్తా ప‌డింది. ఘటనలో 20 మంది గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానం.

RTC bus overturned on NH-44 in Jogulamba Gadwal district, passengers injured, emergency rescue operations underway
RTC bus overturned on NH-44 in Jogulamba Gadwal district, passengers injured, emergency rescue operations underway

జోగులాంబ గ‌ద్వాల్ జిల్లాలో గురువారం అర్థరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలో ఉన్న నేష‌న‌ల్ హైవే 44 పై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం, సంబంధిత ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల మేరకు బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది.

వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు..

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అక్కడుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఎమర్జెన్సీ సేవలు అందించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. అయితే ప్రాథమికంగా డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ప్రమాదం కారణంగా ఎన్‌హెచ్–44పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని నియంత్రించి రవాణాను పునరుద్ధరించారు.

ప్ర‌జ‌ల‌లో ఆందోళ‌న‌..

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఎన్‌హెచ్–44పై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ జాతీయ రహదారిపై బస్సులు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజా ఆర్టీసీ బస్సు ప్రమాదంతో ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »