హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న వేళ, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
అసోసియేషన్ ప్రకారం, తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ బంకులకు పరుగులు పెడుతున్నారు. ఈ పానిక్ బైయింగ్ కారణంగా సాధారణంగా ఉండే విక్రయాల కంటే 2.5 నుంచి 3 రెట్లు ఎక్కువ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో కొంతమంది బంకుల వద్ద తాత్కాలికంగా స్టాక్ ఖాళీ అయినట్లు కనిపించినా, అది నిజమైన కొరత కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా సక్రమంగా నడుస్తోందని, HPCL, IOCL, BPCL సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని డీలర్లు తెలిపారు. సరఫరా గొలుసు ఎక్కడా అంతరాయం లేకుండా కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇక ప్రజల భద్రతపై కూడా అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కొందరు పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్‌ను కెన్లలో నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. ఇది PESO నిబంధనలకు వ్యతిరేకమే కాకుండా ప్రమాదకరమని హెచ్చరించింది. తప్పుగా నిల్వ చేసిన ఇంధనం అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, అవసరానికి మించి ఇంధనం కొనవద్దని, అనధికారిక కంటైనర్లలో నిల్వ చేయవద్దని సూచించింది. ఫేక్ న్యూస్‌ను నమ్మకుండా, అధికారిక సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరింది.
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇలాంటి పానిక్ పరిస్థితులు ట్రాఫిక్ సమస్యలు, సరఫరా లోపాలు, ధరల ఊగిసలాటలకు దారితీసే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఇలాంటి అపోహల కారణంగా కొన్ని రోజులు ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న ఈ కాలంలో, అసత్య సమాచారం ఎంత వేగంగా ప్రజలను ప్రభావితం చేస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టంచేసింది.
ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ, ప్రజల అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తన చాలా కీలకమని అధికారులు సూచిస్తున్నారు.


