కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు.. ఆధారాలు బయటపెడతానంటూ హెచ్చరిక

హుజురాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం నుంచి నగదు వసూళ్ల వరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ, ఆధార

Padi Kaushik Reddy allegations

హైదరాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన ఇన్నోవా వాహనం (TS 09 PA 4195)ను హైదరాబాద్‌లో ప్రైవేట్ వ్యక్తుల అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

ఆ వాహనానికి కరీంనగర్ వన్‌టౌన్ కానిస్టేబుల్ అశోక్, ఏఆర్ కానిస్టేబుల్ అనిల్‌ను డ్రైవర్లుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఐఆర్‌ఎస్ అధికారి వికాస్ అగర్వాల్‌తో సీపీకి స్నేహం ఉండటంతో, అమీర్‌పేట్‌లో నివసిస్తున్న ఆయన తండ్రి కోసం వాహనం వినియోగిస్తున్నారని ఆరోపించారు. గత ఎనిమిది నెలలుగా ఈ వాహనం సుభేదాలో పార్క్ చేసి ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు.

Also Read: రైతు భరోసా డబ్బులు ఎక్కడ? రాజకీయ వాదోపవాదాలు

ఇక మరో ఇన్నోవా వాహనం (TS 09 PA 5601)ను సీపీ సోదరుడు వినియోగిస్తున్నారని, రోజూ చలిమెడ కాలేజీ వద్ద డ్రాప్ చేసేందుకు వాడుతున్నారని తెలిపారు. సీపీ సతీమణికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ఆమె కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను డ్యూటీకి పెట్టడం దారుణమని విమర్శించారు.

నగదు వసూళ్ల ఆరోపణలు

కరీంనగర్ జిల్లాలో పీడీఎస్ బియ్యం సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటికి పాల్పడే వారి నుంచి సీపీ పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వసూళ్ల కోసం ఏసీపీ విజయ్ కుమార్, సీఐ సృజన్ రెడ్డిని నియమించారని చెప్పారు.

అలాగే జిల్లాలో 337 మంది హోంగార్డుల బదిలీల కోసం రూ. కోటి వసూలు చేశారని ఆరోపించారు. పెద్దపల్లిలో హోంగార్డుల బదిలీల విషయంలో మంత్రి జోక్యం చేసుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు.

ఎన్‌ఓసీ కోసం రూ.25 లక్షల వసూలు?

జనవరి 8న ఎస్ఎన్ ఫ్రైడ్ మాల్‌కు ఎన్‌ఓసీ ఇవ్వడానికి రూ.25 లక్షలు వసూలు చేశారని కూడా కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రులకు గన్‌మెన్లు లేకపోయినా, సీపీ మాత్రం 2+2 గన్‌మెన్లు, ఎస్కార్ట్ వాహనాలు వినియోగిస్తున్నారని విమర్శించారు. సీపీ నివాసంలో 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

విచారణ డిమాండ్

ఈ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీకి విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే అన్ని ఆధారాలు బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై సీపీ గౌస్ ఆలం లేదా పోలీస్ శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »