యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఓ ఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును వెంటనే పక్కకు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వెళుతుండగా, బస్సు పంతంగి టోల్‌గేట్ వద్దకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది.
ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును హైవే పక్కకు నిలిపివేశారు. అప్పటికే బస్సులో పొగలు వ్యాపించడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఊపిరాడక భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో కేకలు వేస్తూ అందరూ ఒక్కసారిగా బస్సు నుంచి దిగిపోయి రోడ్డుపైకి పరుగులు తీశారు. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అదే బస్సులో ప్రయాణించడానికి నో..
ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై జరగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులో చిన్న సాంకేతిక లోపమే వచ్చిందని డ్రైవర్ చెప్పి తిరిగి అదే బస్సులో ప్రయాణం కొనసాగించేందుకు సిద్ధమైనప్పటికీ, ప్రయాణికులు మాత్రం తీవ్ర భయంతో అదే బస్సులో వెళ్లేందుకు నిరాకరించారు. వెంటనే మరో బస్సు ఏర్పాటు చేయాలని వారు పంతంగి టోల్‌గేట్ వద్ద ఆందోళనకు దిగారు.
దీంతో ట్రావెల్స్ యాజమాన్యం అత్యవసరంగా హైదరాబాద్ నుంచి మరో ఖాళీ బస్సును పంపించింది. కొత్త బస్సు అక్కడికి చేరుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. అప్పటివరకు ప్రయాణికులు టోల్‌గేట్ సమీపంలోనే వేచి చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు ఈ ఆలస్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వేరే బస్సులో ప్రయాణం..
ఉదయం సుమారు 7:30 నుంచి 8:00 గంటల మధ్యలో ప్రత్యామ్నాయ బస్సు అక్కడికి చేరుకుంది. అనంతరం ప్రయాణికులందరినీ ఆ బస్సులోకి ఎక్కించి విజయవాడ, చెన్నై వైపు పంపించారు. అయితే పాత బస్సు నుంచి తమ లగేజీని కొత్త బస్సులోకి మార్చుకోవడంలో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు.
ఈ ఘటన సమయంలో చౌటుప్పల్ పోలీస్ ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా మరో బస్సులో ప్రయాణం కొనసాగించే వరకు అక్కడే ఉండి సహాయం చేశారు.
టోల్‌గేట్ సిబ్బంది కూడా ప్రయాణికులకు తాగునీరు వంటి కనీస సదుపాయాలు అందించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ట్రాఫిక్ సాధారణంగా కొనసాగుతోంది. పొగలు వచ్చిన బస్సును హైవే పక్కకు తరలించి మెకానిక్ ద్వారా తనిఖీలు చేపడుతున్నారు.
ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సుల్లో సాంకేతిక లోపాలు, అగ్నిప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాల్లో ఇంజిన్ వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ట్రావెల్స్ సంస్థలు వాహనాల నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.