హైదరాబాద్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న TG20 లీగ్ చట్టవిరుద్ధంగా జరుగుతోందని టీసీఏ నేతలు ఆరోపించారు.
అదే రోజు నగరంలో TG20 లీగ్ ప్లేయర్ల వేలం నిర్వహించడాన్ని టీసీఏ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ, హెచ్‌సీఏ నిబంధనల ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్‌ను హెచ్‌సీఏ జనరల్ బాడీ ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
హెచ్‌సీఏ రూల్ 28 ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నిక కావాల్సి ఉండగా, రూల్ 30 ప్రకారం బీసీసీఐ నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలను పాటించకుండా స్వయంకృత గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పడి, బీసీసీఐ అనుమతి ఉన్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
“Hyderabad Cricket Association (HCA) conducting T20 is illegal, not approved; we demand them to stop this league.”
– Telangana Cricket Association Secretary Guruva Reddy pic.twitter.com/AyUEr7TneE
— News Arena India (@NewsArenaIndia) June 7, 2026
ఈ నిబంధనల ఉల్లంఘనల కారణంగా హెచ్‌సీఏ గుర్తింపు రద్దు అయ్యే అవకాశముందని, రూల్ 31 ప్రకారం టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు, అధికారులు, సంస్థలపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ క్రికెటర్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లకూ ఈ నిబంధనలు వర్తించే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీసీఏ సహ-చైర్మన్ యెండల లక్ష్మీనారాయణ, టీసీఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయ్ చంద్రారెడ్డి, మాజీ శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్లను హెచ్‌సీఏ నిర్లక్ష్యం చేస్తోందని నేతలు విమర్శించారు. హైదరాబాద్ జంట నగరాలకే పరిమితమై, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభకు అవకాశాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.
క్రికెట్ అభివృద్ధి కోసం పారదర్శకంగా వ్యవహరించాలని, బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలు నిర్వహించాలని టీసీఏ డిమాండ్ చేసింది.


