మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలతో తెలంగాణ బీజేపీలో కలకలం… క్రాస్ ఓటింగ్‌పై ఢిల్లీ ఆరా

తెలంగాణ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు బీజేపీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి. పలుచోట్ల క్రాస్ ఓటింగ్, ప్రత్యర్థి పార్టీలకు మద్దతు అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వం డిటేయిల్డ్ రిపోర్ట్ కోరినట్లు సమాచారం.

BJP Cross Voting Telangana
BJP Cross Voting Telangana

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఛైర్మన్, మేయర్ ఎన్నికలు రాష్ట్ర బీజేపీలో రాజకీయ వేడి రాజేశాయి. పార్టీ అధికారిక ఆదేశాలకు విరుద్ధంగా పలుచోట్ల బీజేపీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది.

పటాన్‌చెరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎంపీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా నిలిచిన నీలం మధు సతీమణి రేసులో ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. అయినప్పటికీ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సిర్పూర్‌లో కాంగ్రెస్‌కు మద్దతు

అదే విధంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీష్ బాబు కాంగ్రెస్ అభ్యర్థికి, ముఖ్యంగా మైనార్టీ అభ్యర్థికి ఓటు వేయడం కూడా హాట్ టాపిక్ అయింది. తన రాజకీయ ప్రత్యర్థి వర్గానికి ఛైర్మన్ పదవి దక్కకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు.

కరీంనగర్‌లో బీజేపీ జెండా

ఇదిలా ఉండగా కరీంన‌గ‌ర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు తక్కువ సీట్లు వచ్చినా ఇండిపెండెంట్ల మద్దతుతో విజయం సాధించింది. ఈ విజయాన్ని బండి సంజ‌య్ కుమార్ తన కృషిగా చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ గైర్హాజరు వెనుక రాజకీయ అవగాహనలున్నాయన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

క్రాస్ ఓటింగ్‌పై జాతీయ స్థాయిలో స్పందన

  • రాష్ట్ర పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది?
  • ఎందుకు కొన్ని చోట్ల గెలిచిన కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు?
  • ప్రత్యర్థి పార్టీలతో ములాఖత్‌లు ఎవరు జరిపారు?

అనే అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వం వివరాలు కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి డిటేయిల్డ్ రిపోర్ట్ పంపినట్లు సమాచారం.

చర్యలపై ఉత్కంఠ

బీఆర్ఎస్‌కు మద్దతు తెలిపిన రఘునందన్ రావు, కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాల్వాయి హరీశ్‌బాబుపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అలాగే కొన్ని మున్సిపాలిటీల్లో వైస్ ఛైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో అవగాహన చేసుకున్నారనే ఆరోపణలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటికే బీఆర్ఎస్–బీజేపీల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తాజా పరిణామాలు ఆ ప్రచారానికి బలం చేకూర్చాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ బీజేపీలో నెలకొన్న ఈ అంతర్గత రాజకీయాల నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి ఫార్ములాతో రాష్ట్ర యూనిట్‌ను సెట్ రైట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాలు తదుపరి పరిణామాలపై నజర్ పెట్టాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »