తెలంగాణ రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. వారిద్ద‌రికి అవ‌కాశం, సీనియ‌ర్స్‌లో అసంతృప్తి

సీనియర్ నేతలకు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. రెండు రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.

Telangana Rajyasabha Candidates

తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విలకు పార్టీ అవకాశం కల్పించింది. సీనియర్ నేతలకు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి, న్యాయవాది అభిషేక్ మను సింఘ్విలకు పేర్లను ఫైనల్ చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రాజకీయ సలహాదారుగా కొనసాగుతున్న వేం నరేందర్ రెడ్డి పేరు పార్టీ ఖరారు చేయడం విశేషంగా మారింది.

ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. పార్టీ నిర్మాణంలోనూ, ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా సహకరించడంలోనూ కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవకాశం దక్కినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: అబుదాబి ఎయిర్‌పోర్టు సమీపంలో ఇరాన్ దాడి .. తెలంగాణ వ్యక్తికి గాయాలు, టెన్ష‌న్ ప‌డుతున్న కుటుంబం

అభిషేక్ మను సింఘ్వికి సేఫ్ సీట్

జాతీయ స్థాయిలో పేరుపొందిన సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడిగా పలు మార్లు సేవలందించిన అభిషేక్ మను సింఘ్వి ను ఈసారి తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. గతంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో, ఈసారి సేఫ్ సీటుగా భావిస్తున్న తెలంగాణ నుంచి ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం.

జాతీయ స్థాయి రాజకీయ అనుభవం, న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రాభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీనియర్లలో అసంతృప్తి

రాజ్యసభ రేసులో మొదటి నుంచే చర్చలో ఉన్న సీనియర్ నేతలు వి.హ‌నుమంత‌రావు (వీహెచ్), ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు మరోసారి నిరాశే ఎదురైంది. పార్టీ తమకు అవకాశం ఇస్తుందని ఆశించినప్పటికీ, అధిష్టానం నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. పార్టీ లోపల ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

ఎంపికైన ఇద్దరు అభ్యర్థులు నేడు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ ఇద్దరి గెలుపు దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »