తెలంగాణలో ఉన్నత విద్యా ప్రవేశాల్లో పెద్ద మార్పులకు నాంది పలికేలా తెలంగాణ ఎడ్యుకేషన్ కమీషన్ సంచలన సిఫార్సులు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంసెట్ (EAPCET) ప్రవేశ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలను కేవలం ఇంటర్మీడియట్ (12వ తరగతి) మార్కుల ఆధారంగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రవేశ పరీక్షల కారణంగా విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతోందని కమిషన్ చైర్మన్ అకునూరి మురళి పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమర్పించారు.
విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు
కమిషన్ సూచనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ వ్యవస్థను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేసి 11, 12వ తరగతులుగా పరిగణించనున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాస్ మార్కులను పెంచాలని సూచించారు. స్కూల్, ఇంటర్ స్థాయిల్లో పాస్ మార్కులను 35% నుండి 45%కు, డిగ్రీ మరియు పీజీ కోర్సుల్లో 50%కు పెంచాలని ప్రతిపాదించారు.
అదేవిధంగా పీజీ స్థాయి వరకు ఇంగ్లీష్ మీడియంనే కొనసాగించాలని సిఫార్సు చేశారు. విద్యార్థుల్లో గ్లోబల్ కాంపిటీటివ్ నైపుణ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
టీచర్ అర్హతల్లో మార్పులు
టీచర్ల నియామకాల్లో కూడా కీలక మార్పులు సూచించారు. ఇకపై టీచర్ పోస్టుకు డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి చేయాలని, డీఈడీ కోర్సును పూర్తిగా రద్దు చేయాలని కోరారు. దీంతో బోధన నాణ్యత మెరుగవుతుందని కమిషన్ అభిప్రాయపడింది.
ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 18% నిధులను విద్యారంగానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రాథమిక విద్య నుంచే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని భావిస్తున్నారు.
మొత్తంగా ఈ సిఫార్సులు అమలులోకి వస్తే కోచింగ్ సెంటర్లపై ఆధారపడే పరిస్థితి తగ్గి, విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుపై దృష్టి సారించడం ద్వారా ఇంజనీరింగ్ సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.